Monday, April 29, 2024

అతి తక్కువ ఖర్చుతో ఐదు శైవక్షేత్రాల సందర్శన.. భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ కార్తీక మాసం ఆఫర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కార్తీక మాసం సందర్భంగా టీఎస్‌ ఆర్టీసి భక్తులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అతి తక్కువ ఖర్చుతో రాష్ట్రంలోని ఐదు శైవక్షేత్రాలను సందర్శించుకునే అవకాశం కల్పించింది. కార్తీక మాసంలో ముఖ్యంగా భక్తులు శైవక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు భక్తులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ ఆర్టీసీ తక్కువ చార్జీతో ఐదు శైవక్షేత్రాల సందర్శనకు కార్తీకమాస దర్శిని ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ గురుద్వారా వద్ద ప్రారంభమయ్యే యాత్ర అలియాబాద్‌, వర్గల్‌, కొమురవెల్లి, చేర్యాల, కీసరగుట్ట ఆలయాలను దర్శించుకునేలా ప్యాకేజీని రూపొందించారు. దర్శనం అనంతరం పికప్‌ పాయింట్‌ వద్ద డ్రాపింగ్‌ ఉంటుంది. పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 చార్జీ ఉంటుంది. అయితే, ఆలయాల్లో దర్శనం, భోజన ఖర్చులు ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం కూడా టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణంగా రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునే వీలు కల్పించారు.

సాధారణంగా శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో రాత్రి వేళల్లో బస్సులను అనుమతించే వారు కాదు… అయితే, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్‌, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని అధికారులు ఫారెస్ట్‌ ఆఫీసర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇందుకు అంగీకరించిన అటవీశాఖ అధికారులు ఈనెల 20 వరకు అనుమతించారు. దీంతో టీఎస్‌ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినయోగించుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement