Thursday, April 25, 2024

ఢిల్లీలో విశ్వశాంతి మహాయజ్ఞం.. ఏప్రిల్ 6 – 10 వరకు హోమాలు : అశ్విని చౌబే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ధర్మ సంసద్, విశ్వగురు మహా యజ్ఞాన్ని చేపడుతున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే వెల్లడించారు. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ఆలయ ప్రాంగణంలోని ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు హోమాలను నిర్వహించనున్నట్టు న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సనాతన సంస్కృతి సమాగమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సాధువులు వస్తున్నారని చెప్పారు. ఐదు అంశాలపై యాగం, పూజలు ఉంటాయని… కార్యక్రమానికి ముందు 1100 మంది మహిళలతో ఊరేగింపు నిర్వహించనున్నట్టు అశ్వినీ చౌబే చెప్పారు.

శ్రీరామ కర్మభూమి న్యాస్ సిద్ధాశ్రమం, నమో సద్భావన సమితి-హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో సనాతన సంస్కృతి సమాగమం జరుపుతున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు రెండేళ్లుగా విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించినట్టు నమో సద్భావన సమితి ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలతో పాటు భారతదేశం ప్రపంచ గురువుగా అవతరించాలని ఈ మహాయజ్ఞం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దక్షిణ, ఉత్తర భారతదేశానికి చెందిన మహా పండితులు యాగాన్ని నిర్వహిస్తారని, ఇందులో అన్ని మతాల వారు పాల్గొంటారని ఆయన అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement