Friday, April 26, 2024

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, లేదంటే కేంద్రంపై తిరుగుబాటే.. ఢిల్లీ ధర్నాలో బీసీ నేతల హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వారి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఒబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల మహా ధర్నాకు అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు, వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల డిమాండ్ల పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పోరాడుతున్నారని, ఎన్నో ప్రభుత్వాలు మారినా బీసీ బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు సంఘటితమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

పేరుకే బీసీ ప్రధాని : ఎంపీలు రవిచంద్ర, లింగయ్య యాదవ్

- Advertisement -

బీసీ ప్రధానినని చెప్పుకునే మోదీ  గత తొమ్మిది సంవత్సరాల పాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. ఆయన మాటల కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, నేటి వరకు దానికి  అతీ గతీ లేదన్నారు. బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 60 శాతం ఉన్నవారికి అరశాతం కూడా కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు నిధులు కేటాయించకుండా అవమానించిందని ఆరోపించారు.

బీసీల పోరాటానికి మా మద్దతు : ఎంపీలు వెంకటరమణ, మస్తాన్‌రావు

వెనుకబడిన వర్గాల కులగణన, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుండి 50 శాతానికి పెంచాలనే డిమాండ్లపై పార్లమెంట్‌లో వైసీపీ తరఫున తాము ప్రతిరోజు పోరాడుతున్నామని, బీసీలకు న్యాయం జరిగే వరకూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తెలిపారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, రాజకీయ అధికారంలో బీసీలకు సగభాగం దక్కాల్సిందేనని వారు ఉద్ఘాటించారు.

బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలని, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. కేంద్రం అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిపై తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బీసీ కళామండలి కళాకారులు ఆటపాటలతో నిరసన ప్రదర్శనను హోరెత్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement