Wednesday, May 1, 2024

రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో విజయసాయి రెడ్డి.. కొత్త ప్యానెల్‌లోనూ మరోసారి అవకాశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గతంలో ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో విజయసాయి రెడ్డికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పదవీ విరమణ చేయడంతో కొత్త ఉపరాష్ట్రపతి (రాజ్యసభ ఛైర్మన్) జగ్‌దీప్ ధన్కడ్ కొత్త ప్యానెల్ రూపొందించారు. మొత్తం 8 మందితో ధన్కడ్ ప్యానెల్‌ను పునర్వ్యవస్థీకరించారు. ఆ జాబితాలో విజయ సాయిరెడ్డితో పాటు భువనేశ్వర్ కలిత, డా. ఎల్. హనుమంతయ్య, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రాయ్, డా. సస్మిత్ పాత్ర, సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నాగర్ ఉన్నారు.

సోమవారం ఈ జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. తనకు వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో అవకాశం కల్పించినందుకు రాజ్యసభ చైర్మన్‌ ధన్కడ్‌కు విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌లో తనతోపాటు జాబితాలో ఉన్న మిగతా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వైస్ చైర్మన్ ప్యానెల్ జాబితాలో ఉన్న సభ్యులు రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహిస్తారు. గత సమావేశాల్లో విజయసాయి రెడ్డి సభాపతి స్థానంలో కూర్చున్న విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement