Thursday, May 2, 2024

వాహనాల రీకాల్‌… సంఖ్య దారుణంగా ఉంటే కంపెనీలపై చర్యలు

హైదరాబాద్‌ (ఆంధ్రప్రభ) : లోటుపాట్లు చోటుచేసుకున్నపక్షంలో వాహనాలను రీకాల్‌ చేస్తారన్న విషయం తెలిసిందే. కాగా రీకాల్ సందర్భాలు మరీ ఎక్కువసార్లు చోటుచేసుకున్నట్లైతే… సదరు కంపెనీలపై చర్యలు తీసుకునే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు వినవస్తోంది. గత మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా రీకాల్‌ అయిన వాహనాల గణాంకాలను వెల్లడిస్తున్న సందర్భంలో కేంద్రం ఈ అంశాన్ని సూచనప్రాయంగా వెల్లడించింది. మొత్తంమీద వాహనాల రీకాల్‌ విధానానికి సంబంధించి త్వరలో మరిన్ని మార్పులు చోటుచేసుకోవచ్చని వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో 2022 లో దేశవ్యాప్తంగా 13 లక్షల వాహనాలను రీకాల్‌ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో అధికభాగం ద్విచక్ర వాహనాలు కాగా, మిగిలినవి కార్లు తదితర వహనాలు. కాగా… వాహనాలను ఇలా రీకాల్‌ చేయడానికి సంబంధించి… ఇంత గరిష్టస్థాయిలో జరగడం గత మూడు సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గట్కరీ సోమవారం లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా వివరాలను నివేదించారు. ఇదిలా ఉంటే… రీకాల్‌ అయిన వాహనాల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఉంది. దాదాపు అరలక్ష మేరకు వాహనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్‌:ఏఎంఏ) డేటా ప్రాతిపదికన కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం 8,64,557 ద్విచక్రవాహనాలు, మరో 4,67,311 ప్యాసింజర్‌ వాహనాలను రీకాల్‌ చేశారు.

ఇదిలా ఉంటే… ఈ ఆర్ధికసంవత్సరం జులై 15 నాటికి 1,60,025 ద్విచక్రవాహనాలు, 25,142 ప్యాసింజర్‌ కార్లను రీకాల్‌ చేశారు. ఇక 2020-21 లొ 2.14 లక్షల వాహనాలను రీకాల్‌ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక 2020 క్యాలెండర్‌ సంవత్సరంలో కార్లు, ట్యాక్సీలు, వ్యాన్లు, లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌కు సంబంధించి… ,60,986 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కేంద్రం నివేదించింది. ఇక 2020 లో జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల కారణంగా 33,148 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. మొత్తంమీద వాహనాల రీకాల్‌కు సంబంధించిన విధివిధానాల్లో భారీ మార్పులే తేవాలని కేంద్రం యోచిస్తున్నట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement