Sunday, April 28, 2024

Delhi | పిల్లలకే కాదు, పెద్దలకూ వ్యాక్సిన్లు.. ఢిల్లీ అపోలో వైద్యుల వినూత్న ప్రదర్శన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించే టీకాలు కేవలం చిన్నారులకే కాదు, పెద్దలకు కూడా అవసరమేనని ఢిల్లీలోని అపోలో వైద్యులు చెబుతున్నారు. పెద్దల వ్యాక్సిన్లపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో డ్యాన్స్ చేస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. శనివారం ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు డాక్టర్ అరుణ్ ప్రసాద్, డాక్టర్ వినీ కాంత్రూ, డాక్టర్ ఎంఎస్ కన్వర్, డాక్టర్ పర్వీన్ సోధి, డాక్టర్ పాఖీ అగర్వాల్, డాక్టర్ సుప్రీత్ కౌర్, డాక్టర్ అంజలితో కూడిన వైద్యుల బృందం డా. కల్పన నాగ్‌పాల్ నేతృత్వంలో ఈ ప్రదర్శన చేపట్టింది.

పెద్దల కోసం అందుబాటులో ఉన్న వివిధ వ్యాక్సిన్‌లు, అవి ఏ వ్యాధులను నివారిస్తాయో తెలియజేసే సందేశాలతో ప్లకార్డులను పట్టుకుని వైద్యులు నృత్యం చేశారు. భారతదేశంలో వయోజన టీకాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అగ్రశ్రేణి వైద్యులతో ఒక అవగాహన సదస్సును నిర్వహించిన ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్, ఆ తర్వాత ఈ వినూత్న ప్రదర్శన చేపట్టింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన డా. కల్పన వయోజన టీకాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహనను పెంచే ప్రయత్నంలో భాగంగా డ్యాన్స్ జిగ్ ఈవెంట్‌ను నిర్వహించామని చెప్పారు. పెద్దల టీకాల లభ్యత, అవి నిరోధించే వ్యాధులు, వివిధ వయసుల వారికి సిఫార్సు చేసే టీకా షెడ్యూల్‌ల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. చాలా మందికి తమను జీవితాంతం బలహీనపరిచే వ్యాధుల నుంచి రక్షించగల టీకాల గురించి తెలియదని, దేశంలో చాలా మంది వయోజనులకు, వైద్యులకు కూడా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ గురించి తెలియదని ఆమె చెప్పారు.

- Advertisement -

ప్రభుత్వం కూడా వయోజనులకు వ్యాక్సిన్లను అందుబాటు ధరల్లో ఉంచాలని సూచించారు. వయోజనులు వ్యాక్సిన్లను వినియోగించడం ద్వారా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలు దరి చేరకుండా ప్రజలు వ్యాక్సిన్ల ద్వారా రక్షణ పొందవచ్చని ఆమె అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement