Monday, April 29, 2024

అదానీ ఇన్వెస్టర్లపై అమెరికా నిఘా.. 10 శాతం పతనమైన గ్రూప్‌ షేర్లు

అదానీ గ్రూప్‌ ఆఫ్‌షోర్‌ కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ విచారణ జరుపుతుందని బ్లూమ్‌బర్గ్‌ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. ఈ ఆదేశాల గురించి తమకు తెలియదని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికా ఇన్వెస్టర్ల వివరాలను ఆరా తీస్తున్నట్లు ఈ వార్తకథనం పేర్కొంది. అదానీ గ్రూప్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన సంస్థలు, వ్యక్తుల గురించి అమెరికా అటార్నీ విచారణ జరుపుతోంది.

దీంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లు 10 శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 9.8 శాతం నష్టపోయి 2,163.03 రూపాయల వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు 5 శాతం నష్టపోయాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌, అదానీ విల్మర్‌ కంపెనీల షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. మొత్తం 10 అదానీ గ్రూప్‌ షేర్ల పతనంతో శుక్రవారం ఒక్క రోజే 54,686 కోట్ల మార్కెట్‌ సంపద నష్టపోయింది.

- Advertisement -

దీంతో కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ 9,73,200 కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూప్‌ సంస్థలు వ్యాపారాలు నిర్వహించే పరిధిలోని అన్ని నిబంధనలు, అకౌంటింగ్‌ ప్రమాణాల ప్రకారం ఉన్నాయని తెలిపింది. ఇవి ప్రమాణాల ప్రకారం లేవని, నిబంధనలు పాటించడంలేదన్న ఆరోపణలను అదానీ గ్రూప్‌ త్రోసిపుచ్చింది.

జనవరిలో హిండెన్‌బర్గ్‌ అదానీ గ్రూప్‌పై చేసిన అన్ని ఆరోపణలను సంస్థ తిరస్కరించింది. దీనిపై ఇప్పటికే మన దేశంలో సెబీ నిపుణుల కమిటీ విచారణ జరుపుతోంది. ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అమెరికాలోనూ అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారిపై నిఘా సంస్థలు విచారణ జరుపుతున్నారన్న వార్త కలకలం సృష్టించింది. ఈ వార్తతో అన్ని అదానీ గ్రూప్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement