Thursday, April 25, 2024

రాష్ట్రం పరిధిలోనే హైకోర్టు తరలింపు.. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నపై కేంద్ర మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గురువారం రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఇచ్చిన రాతపూర్వక సమాధానమిస్తూ.. 2020 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు తరలింపు అనేది రాష్ట్ర హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణ వ్యయం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అలాగే హైకోర్టు రోజువారీ పాలనా వ్యవహారాల బాధ్యత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదేనని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే విషయంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర హైకోర్టు ఒక అభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉందని ముక్తాయింపునిచ్చారు.

2018 అక్టోబర్ 29న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలయ్యాయని, 2020 ఆగస్టులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఏపీ ప్రభుత్వం స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement