Thursday, March 28, 2024

Big story | ప్రమాదంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ..

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా ఆర్థిక పరిస్థితి. యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. కోవిడ్‌ తీవ్రత తగ్గిన నేపథ్యంలో అగ్రరాజ్యమైన ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కరోనా మహమ్మారితో అమెరికా ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్ల కిందట కుదేలైంది. కోవిడ్‌ తీవ్రత తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మళ్లి గాడిలో పడుతుందని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. అమెరికాలో తాజాగా బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల రెండు ప్రధాన బ్యాంకులు దివాళా తీశాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంకుకు తాళాలు పడ్డ సంఘటన నుంచి జనం కోలుకోకముందే సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా దివాళా తీసింది.

సిగ్నేచర్‌ బ్యాంక్‌ను ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకుంది. న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోన్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఎక్కువగా కృత్రిమ విలువ కలిగిన క్రిఎ్టో డిపాజిట్లను కలిగి ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సిగ్నేచర్‌ బ్యాంకు అంటే చిన్నా చితకా బ్యాంక్‌ కాదు. 2022 డిసెంబర్‌ ముగింపు నాటికి భారతీయ కరెన్సీలో దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉంది సిగ్నేచర్‌ బ్యాంక్‌. ఆస్తులతో పాటు దాదాపు 7.30 లక్షల కోట్ల రూపాయల మేరకు సిగ్నేచర్‌ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి. అయితే డిపాజిట్‌దారులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి వీలుగా తాత్కాలికంగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు బ్యాంక్‌ అధికారులు.

- Advertisement -

రెండు ప్రముఖ బ్యాంకులు దివాళా తీయడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది అమెరికా ప్రభుత్వం. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల పతనానికి కారకులైన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ చెప్పారు. డిపాజిట్‌దారులు తమ సొమ్ము గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదే విషయమై మీడియా ప్రతినిధుల నుంచి వరుసగా ప్రశ్నలు రావడంతో సమాధానం ఇవ్వలేక ఒక దశలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను అర్థాంతరంగా ముగించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.

రెండో అతి పెద్ద షట్‌డౌన్‌..

రెండు ప్రముఖ బ్యాంకులు ఒకదాని తరువాత మరొకటి దివాళా తీయడాన్ని ఇటీవలి కాలంలో అమెరికాలో సంభవించిన రెండో అతి పెద్ద షట్‌డౌన్‌గా పేర్కొంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద సంక్షోభం 2008 సంవత్సరంలో వచ్చింది. ఆ ఏడాది బ్యాంకింగ్‌ సంస్థ లెమాన్‌ బ్రదర్స్‌ చేతులెత్తేసింది. లెమాన్‌ బ్రదర్స్‌ సంస్థ దివాళా తీసిన తరువాత, అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నది. మాంద్యంపై ముందుగానే హెచ్చరించిన లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌ అమెరికా ప్రజలు అలాగే ఆర్థిక కంపెనీలు మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కిందటేడాదే గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ సీనియర్‌ చైర్మన్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌ హెచ్చరించారు.

ఆర్థికంగా అమెరికా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతోందని బ్లాంక్‌ ఫెయిన్‌ చాలా ముందుగా హెచ్చరించారు. లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌ అంటే సాదాసీదా వ్యక్తి కాడు. అమెరికా ఆర్థిక వ్యవహారాలను ఔపోసన పట్టిన వ్యక్తి. దీంతో బ్లాంక్‌ఫెయిన్‌ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సప్లయ్‌ చైన్‌ వ్యవస్థ అమెరికా సరిహద్దుల పరిధిలో లేకపోవడమే ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణమన్నారు లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌. అమెరికాలో ఆర్థిక మాంద్యం అంటూ వస్తే ఆ ప్రభావం అనేక దేశాలపై తప్పకుండా పడుతుంది. అమెరికా నుంచి పెట్టబడులు తగ్గుతాయి. అంతేకాదు అనేక రంగాలపై దీని ప్రభావం ఉంటుంది. 2008లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. మొదట బ్యాంకింగ్‌ రంగాన్ని సంక్షోభం ఆవహించింది. ఆ తరువాత టోటల్‌గా ఆర్థిక వ్యవస్థకు విస్తరించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కోవిడ్‌ తరువాత అమెరికాలో సప్లయ్‌ చెయిన్‌ వ్యవస్థ దెబ్బతిన్నది.

మాంద్యం నుంచి అనేక దేశాలు కోలుకుంటున్న దశలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో రష్యా దాడుల ప్రభావం ఆయా దేశాలపై పడింది. ఫలితంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుతం ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక మాంద్యం వస్తోందన్న హెచ్చరికలకు ముందుగా అలర్ట్‌ అయింది బడా బడా టెక్‌ కంపెనీలే. ఆర్థిక మాంద్యం పేరుతో అమెజాన్‌, మైక్రోసాప్ట్‌, ట్విట్టర్‌ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అనేక టెక్‌ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి.

మారిన ప్రపంచ పరిస్థితులు..

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడుల తరువాత, యావత్‌ ప్రపంచ పరిస్థితి మారిపోయింది. నాటో పేరు చెప్పి, మరో కారణం చూపించి అనేక దేశాలకు రష్యా ఆయిల్‌ సరఫరా నిలిపివేసింది. దీంతో అనేక యూరోపియన్‌ దేశాల్లో ఆయిల్‌ రేట్లు ఎడాపెడా పెరిగాయి. సహజంగా మెజారిటీ యూరోపియన్‌ దేశాలు నాటో కూటమిలో సభ్య దేశాలుగా ఉంటాయి. ఉక్రెయిన్‌ పై రష్యా దాడులకు ప్రధాన కారణం నాటో కూటమేనన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులను నాటో కూటమి దేశాలు వ్యతిరేకించాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చివరకు అనేక యూరోపియన్‌ దేశాలకు అవసరాలకు తగ్గట్లు ఆయిల్‌ అందలేదు. అంతిమంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. సహజంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి చాలా ఎక్కువ గ్రోత్‌ రేటు ఉంటుంది. అలాంటి ఐటీ సెక్టార్‌కు కూడా మాంద్యం దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.

ఒక సర్వీస్‌ సెక్టార్‌ దెబ్బతింటే, దానిపై ఆధారపడ్డ అనేక పరిశ్రమలు అంటే ఫుడ్‌ ఇండస్ట్రీ, షాపింగ్‌ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్నీ దెబ్బతింటాయి. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌కూ ఆర్థిక మాంద్యం భయం: భారత్‌లోనూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. పెరిగిన ధరలతో పేదలు,సామాన్యులు విలవిలలాడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరగడంతో ఆ ప్రభావం రవాణా రంగంపై పడింది. అనేక రాష్ట్రాల్లో ప్రజా రవాణా వ్యవస్థ రేట్లు పెరిగాయి. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగం పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. మనదేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండదని భరోసా ఇస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

ఇటీవలి కాలంలో 2008లో భారత్‌ను ఆర్థిక మాంద్యం కమ్మేసింది. అయితే మాంద్యం నుంచి భారత్‌ చాలా త్వరగా బయటపడింది. దీనికి ప్రధాన కారణం భారత్‌ ఎగుమతులపై ఆధారపడ్డ దేశం కాకపోవడమే. దేశీయ మార్కెట్టే భారత్‌కు మూలాధారం. అలనాటి మాంద్యం నుంచి భారత్‌ బయటపడటానికి ఇదొక ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఏమైనా ఆర్థిక మాంద్యం అనేది చిన్న విషయం కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జనం బతుకులు తెల్లారతాయి. మాంద్యం నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆర్థికరంగ నిపుణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement