Saturday, June 22, 2024

అసంతృప్తిలో ఈటెల-బుజ్జ‌గించేందుకు అమిత్ షా పిలుపు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ..హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ భేటీ ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన గురించి చర్చించామన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి కూడా షాతో మాట్లాడినట్టు తెలిపారు. ఈటల ఉన్నట్టుండి షాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
టీఆర్ఎస్ కు రాజీనామా చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన రాజేందర్ కు ఉద్యమకారుడిగా, బలమైన బీసీ నేతగా మంచి పేరుంది. కానీ, రాజేందర్ ను రాష్ట్ర బీజేపీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనను పక్కనబెట్టారని దాంతో రాష్ట్ర నాయకత్వంపై ఈటల అసంతృప్తితో ఉన్నారన్న చర్చ నడుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న షా.. ఈటలను ఢిల్లీ రప్పించుకొని ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందట‌. రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని, అందులో భాగంగానే షా నుంచి ఈటలకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటలకు బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈటలకు పదవి ఇస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను బీజేపీలో పట్టించుకోవడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు బీసీ నేతలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement