Friday, May 3, 2024

చిరుతపులి బారి నుంచి సోదరులను కాపాడిన బర్త్ డే కేక్

కొన్నిసార్లు కండ బలం కంటే బుద్ధి బలం ఉపయోగించాలని పెద్దలు చెప్తుంటారు. అచ్చం ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. కుమారుడి పుట్టిన రోజు నేపథ్యంలో ఫిరోజ్‌, అతడి సోదరుడు సబీర్ మన్సూరి బైక్‌పై వెళ్లి బర్త్‌ డే కేక్‌ కొనుగోలు చేశారు. వారిద్దరు గ్రామానికి బైక్‌పై తిరిగి వస్తుండగా చెరకు తోట నుంచి వచ్చిన ఒక చిరుతపులి వెంబడించింది. బైక్‌ను వేగంగా పోనిచ్చినప్పటికీ మరింత వేగంతో వారిని సమీపించసాగింది. దీంతో బైక్‌ వెనుక కూర్చొన్న సబీర్‌ మరో దారి లేక చేతిలో ఉన్న బర్త్‌ డే కేక్‌ బాక్స్‌ను ఆ చిరుతపులి పైకి విసిరాడు. కేక్‌ బాక్స్‌ తలిగి షాక్‌ అయిన ఆ చిరుత పరుగెత్తడం ఆపి సమీప పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ సోదరులు తమ ఇళ్లకు చేరుకున్నారు.

అనంతరం వారు చిరుతపులి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా సుమారు 500 మీటర్ల మేర చిరుతపులి వెంటాడిన వారిద్దరిని బర్త్‌ డే కేక్‌ కాపాడిందని అటవీ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వారి వద్ద కేక్‌ మాత్రమే ఉన్నదని, ప్రాణ రక్షణ కోసం చిరుతపై విసిరి దాని బారి నుంచి తప్పించుకున్నారని వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: అమ్మవారికి చెప్పుల దండ సమర్పించే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement