Thursday, May 16, 2024

Followup | యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ.. ప్రక్షాళన, పునర్నిర్మాణానికి కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సహా మరికొందరు ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం ఉదయం యూపీఎస్సీ ఛైర్మన్ డా. మనోజ్ సోనిని కలిశారు. గంటకు పైగా ఆయనతో టీఎస్‌పీఎస్సీని లోపరహితంగా తీర్చిదిద్దడంపై చర్చించారు.

ఈ క్రమంలో “యూపీఎస్సీకి సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది.. సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్ధిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం.. అన్నింటా పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంది. ఈవిష‌యంలో మేం యూపీఎస్సీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ)ను ఆ విధంగానే రూపొందించాల‌ని నిర్ణ‌యించుకున్నాం” అంటూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోనికి తెలిపారు. ఈ భేటీలో యూపీఎస్సీ ఛైర్మ‌న్‌తో పాటు కార్య‌ద‌ర్శి శ‌శిరంజ‌న్ కుమార్‌ పాల్గొన్నారు.

టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుమారు గంట‌న్న‌ర పాటు వారు చ‌ర్చించారు. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంద‌ని, అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌ని చేస్తున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క ప్ర‌క్రియ‌లో నూత‌న విధానాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌నుకుంటున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యూపీఎస్సీ ఛైర్మ‌న్ సానుకూలంగా స్పందిస్తూ యువ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నియామ‌కాల ప్ర‌క్రియ‌పై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

- Advertisement -

యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కంలో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌ద‌ని, స‌మ‌ర్థత ఆధారంగా ఎంపిక ఉంటుంద‌ని తెలిపారు. తాము 2024 డిసెంబ‌రు నాటికి 2 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నామ‌ని, ఇందుకు టీఎస్‌పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాల‌నుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రి ఛైర్మ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. గ‌త ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కాన్ని రాజ‌కీయం చేసి, దానినో రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింద‌న్నారు. ఫ‌లితంగా పేప‌ర్ లీకులు, నోటిఫికేష‌న్ల జారీ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల వెల్ల‌డి ఓ ప్ర‌హ‌స‌నంగా మారింద‌న్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌యింద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం, అస‌మ‌ర్ధ‌త‌ కారణంగా నియామ‌కాల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చోటు చేసుకుంద‌న్నారు.

తాము రాజ‌కీయ ప్ర‌మేయం లేకుండా ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కం చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో అవ‌క‌త‌వ‌ల‌కు తావులేకుండా సిబ్బందిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తామ‌ని వివ‌రించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ త‌ర‌హాలో తీర్చిదిద్దాల‌నుకుంటున్నందున టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్ష‌ణ ఇస్తామ‌ని, స‌చివాల‌య సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి వాణీ ప్ర‌సాద్‌ పాల్గొన్నారు.

సైనిక్ స్కూలు ఏర్పాటు చేయండి.. రక్షణ భూములు బదలాయించండి

యూపీఎస్సీ ఛైర్మన్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కణ్ణుంచి ఇద్దరు నేతలు కలిసి సీఎం అధికారిక నివాసం 23, తుగ్లక్ రోడ్ చేరుకున్నారు. అప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరగా.. కేంద్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ఉదయం మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేకపోయారు. సాయంత్రం తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నేతలిద్దరూ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రక్షణ శాఖ గతంలో మంజూరు చేసిన సైనిక్ స్కూల్ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు.

ఇదివరకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన, సహకారం లేకపోవడంతో సైనిక్ స్కూలు ఏర్పాటు సాధ్యపడలేదు. తాము రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులన్నీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. దీనిపై సానుకూలత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలో ఉన్న భూములు కేటాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం అక్క‌డ ఉన్న ర‌క్ష‌ణ శాఖ భూమి 0.21 హెక్టార్ల‌ను రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాల‌ని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు.

ఆ భాగంలో మిన‌హా స్కైవే నిర్మాణం పూర్తి కావ‌స్తున్నందున ఆ భూమిని వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. అందుకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సుముఖ‌త వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండంను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూమి అవ‌స‌ర‌మ‌ని దానిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి విజ్ఙ‌ప్తి చేశారు.

నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్ల‌కోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్య‌త్తులో డ‌బుల్ డెక్క‌ర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తుల‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రి సానుకూల స్పంద‌న వ్య‌క్తం చేశారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

నిధులు విడుద‌ల చేయండి.. నిర్మలకు రేవంత్, ఉత్తమ్ వినతి

రక్షణ మంత్రితో భేటీ అనంతరం నార్త్‌బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. వెనుక‌బడిన జిల్లాల అభివృద్ధి కోసం 2019-20, 2021-22 నుంచి 2023-24 వ‌ర‌కు ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున విడుద‌ల చేయాల్సిన మొత్తం రూ.1,800 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.2,233.54 కోట్ల నిధులను కూడా త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement