Saturday, May 18, 2024

TS | ప్ర‌శ్నిస్తే బ్యాన్ చేస్తారా… అవినీతి కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉండదు : కేసీఆర్

ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే అని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 200 సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని కేసీఆర్ తెలిపారు. పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రామ‌గుండంలో నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. నా బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెలు దడదడలాడుతున్నాయి అని కేసీఆర్ అన్నారు. నన్ను అడ్డుకునేందుకు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని, నా ప్రచారాన్ని నిషేధించారని కేసీఆర్ అన్నారు.

రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. కానీ అమిత్ షా చేతిలో దేవుడి బొమ్మ పెట్టుకుని మాట్లాడుతుంటే.. ఈసీకి అది కనిపించడం లేదు. హిందువులు ముస్లింలు అని ప్రధాని మోదీ చెబితే ఈసీ వినిపించ‌డంలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే గుడ్లు పీకి గోలీలు ఆడుతాం, పండ‌వెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అని మాట్లాడితే ఈసీకి క‌న‌బ‌డ‌దు. చేనేత కార్మికుల పక్షాన మాట్లాడుతే ఈ తరహా నిషేధం విధించారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ప్రజలే నిర్ణయిస్తారని కేసీఆర్ అన్నారు.

అర‌చేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల‌ని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి క‌ర్రకాల్చి వాత‌పెట్టే స‌మ‌యం వ‌చ్చింది. బీఆర్ఎస్ బ‌లంగానే ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నెర‌వేరుస్త‌ది. అవినీతి కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉండదు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తోంది.. ప్రజల మద్దతుతో మళ్లీ మ‌న‌మే వస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడుకోగ‌లుగుతాం కేసీఆర్ అన్నారు. కాబ‌ట్టి విజ్ఞ‌త‌తో ఆలోచించి బీఆర్ఎస్‌ను గెలిపించాలి. కొప్పుల ఈశ్వ‌ర్ నిస్వార్థ‌ప‌రుడు. కార్మిక లోకంలో బ‌తికిన వ్య‌క్తి.. ఆయ‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కేసీఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement