Monday, April 29, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం పార్లమెంట్ హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు విపక్షాలు మద్దతు తెలిపిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేశారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలందరూ కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావుతో పాటు కొత్త ప్రభాకరరెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధిరెడ్డి, మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు..
ఖమ్మం జిల్లా నుంచి టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా సోమవారం పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలిరోజే భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సహచర ఎంపీలతో కలిసి పార్లమెంట్‌లో ఓటు వేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఒకే రోజు రెండు అత్యున్నత చారిత్రక సంఘటనలు జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎంపీ రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement