Thursday, April 25, 2024

ఆదాయపు పన్ను మదింపు బదిలీ.. ఢిల్లి హైకోర్టులో గాంధీల పిటిషన్లు కొట్టివేత

ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారీకి సంబంధించిన వ్యవహారంలో తమ అసెస్‌మెంట్‌లను సాధారణ మదింపు కాకుండా సెంట్రల్‌ సర్కిల్‌కు బదిలీ చేయాలన్న ఆదాయపు పన్ను శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వేసిన పిటిషన్‌లను ఢిల్లి హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌, జవహర్‌ భవన్‌ ట్రస్ట్‌, రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, యంగ్‌ ఇండియాతోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.

తమ బదిలీకి సంబంధించిన ఐటి ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాలను గాంధీలు సవాలు చేశారు. ‘పిటిషనర్ల అంచనా చట్టం ప్రకారం సెంట్రల్‌ సర్కిల్‌కు బదిలీ చేయబడింది. ప్రస్తుత రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తున్నాం”అని న్యాయమూర్తులు మన్మోహన్‌, దినేష్‌ కుమార్‌ శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ పేర్కొంది.

- Advertisement -

సెంట్రల్‌ సర్కిల్‌కి బదిలీ చేయడం అంటే ఏమిటి?

ఐటీ డిపార్ట్‌మెంట్‌ దర్యాప్తు విభాగంలో సెంట్రల్‌ సర్కిల్‌లు అంతర్భాగం. సోదాల సమయంలో సేకరించిన సాక్ష్యాలను సెంట్రల్‌ సర్కిల్‌ స్వాధీనం చేసుకుంటుంది. కేసును తార్కిక ముగింపుకు తీసుకువెళుతుంది. గాంధీలకు వ్యతిరేకంగా ఐటీ అసెస్‌మెంట్‌ ఇప్పుడు సెంట్రల్‌ సర్కిల్‌ ద్వారా పూర్తి చేయబడుతుంది. పన్ను ఎగవేత కేసుల్లో విచారణ విభాగం ద్వారా ప్రాసిక్యూషన్‌ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement