Saturday, May 18, 2024

నేటి సంపాద‌కీయం.. చినికి చినికి గాలివాన‌గా..

కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆదేశం చినికిచినికి గాలివానగా మారింది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో కుందాపుర పట్టణలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో హిజాబ్‌ ధరించిన విద్యార్ధినులను ప్రధాన ద్వారం వద్ద నిలిపివేయడంతో ఆ వర్గానికి చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులు ఆందోళన ప్రారంభించారు. హిజాబ్‌ అనేది ముస్లిం బాలికల ఆహార్యంలో ముఖ్యమైనది. అది వారి మత సంప్రదాయం. అందువల్ల దానిని తొలగించి తరగతులకు హాజరుకావాలన్న ఆదేశాలపై విద్యార్ధినీవిద్యార్ధులు భగ్గుమంటున్నారు. కర్నాటకలో ఉడిపి ప్రసిద్ధ యాత్రా కేంద్రం అక్కడ హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ ఆలయం ఉంది. ఉడిపికి పక్కనే ఉన్న పట్టణాలు, గ్రామాల్లో ముస్లిం జనాభా ఎక్కువ. కర్నాటకలో మత పరమైన విశ్వాసాలు, ఆచారాలు ఎక్కువగా ఉన్న మాట నిజమే కానీ, అదే సందర్భంలో మతసహనానికి పెట్టింది పేరు. అయితే, దశాబ్దాల క్రితం హుబ్లిలోని ఈద్గా మైదానంలో జెండా ఎగురవేయడానికి బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి ప్రయత్నించి అరెస్టు కావడంతో అక్కడ సంఘ్‌ కార్యకలాపాల అంకురార్పణ జరిగింది. అంతకుముందు వరకూ అక్కడ మత శక్తుల ఊసే లేదు. అప్పటి నుంచి సంఘ్‌ పరివార్‌, బీజేపీలు ఉత్తర కర్నాటకలో తమ పట్టును పెంచుకోవడానికి యత్నాలు సాగిస్తూ వచ్చాయి. ఈ యత్నాలకు మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఊతం ఇచ్చారు. మత పరమైన కార్యక్రమాలు, ఉత్సవాల్లో అన్ని మతాల వారూ పాల్గొనడం అక్కడి సంప్రదాయం.

విద్యా సంస్థల్లో మత ప్రసక్తి ఎన్నడూ ఉండేది కాదు. అటు వంటిది, యెడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన బసవరాజ్‌ బొమ్మై బీజేపీ అధిష్టా నాన్ని మెప్పించడం కోసం సంఘ్‌ పరివార్‌ అజెండాను దూకుడుగా అమలు జరిపేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ ఆర్‌ బొమ్మై కరుడుకట్టిన లౌకిక వాది. జాతీయ స్థాయిలో వీపీ సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు లో సహకారం అందించారు. రాజకీయ దురంధరుడైన రామకృష్ణ హెగ్డేతో కలిసి కర్నాటకలో జనతా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేశారు. బసవరాజ్‌ బొమ్మై మొదటి నుంచి సంఘ్‌ పరివార్‌తో సన్నిహితంగా ఉండేవారు. ఆ క్రమంలోనే యెడియూరప్పకు సన్నిహితమయ్యారు. యెడియూరప్ప అధికారం నుంచి తప్పుకోవల్సి వచ్చినప్పుడు తనకు అత్యంత విధేయుడైన బసవరాజ్‌ బొమ్మైను బొమ్మగా నిలబెట్టారు. ఆయన ఎంపికను బీజేపీలోనే పలువురు వ్యతిరేకించారు. బొమ్మైని మారు ద్దామని బీజేపీ అధిష్ఠానవర్గం ఆ మధ్య ప్రయత్నించింది. కానీ, పార్టీలో అన్ని వర్గాలనూకలుపుకుని పోతాననీ, పార్టీ అజెండాను మరింత పకడ్బందీగా అమలుజేస్తానని మాట ఇచ్చి తన పదవిని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాతే ఆయనకు హిజాబ్‌ నిషేధం వంటి ఆలోచనలు వచ్చి ఉండవచ్చు.

కట్టు, బొట్టు, జుట్టు వంటి ఆచార వ్యవహారాల్లో మహిళలకు మన దేశంలో సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఈ అంశాలపై ఎవరు ఎప్పుడు మాట్లాడినా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అది మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం. అయినా ముస్లిం విద్యార్ధినులు హిజాబ్‌ ధరించడం వల్ల ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. విద్యాసంస్థల్లో డ్రెస్‌ కోడ్‌ పేరిట ఆయా సంస్థల యాజమాన్యాలు ఇలాంటి నిషేధాలు రుద్దినప్పుడు ఆందోళనలు వ్యాపిస్తుంటాయి. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. దీనిపై సాగుతున్న ఆందోళనల పట్ల కర్నాటక హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఒక వంక ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతుండగా, విద్యార్ధులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడం, పరస్పరం దాడులు చేసుకోవడం మంచిది కాదని హెచ్చరించింది. విద్యార్ధినులు హిజాబ్‌ ధారణకు ప్రతిగా కొందరు విద్యార్ధులు కాషాయి కండువాలతో తరగతులకు హాజరవుతున్నారు. శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని చెదరగొట్టేందుకు ఎవరిమటుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. శ్రీరంగపట్నను రాజధానిగా చేసుకొని మైసూర్‌ రాజ్యా న్ని పాలించిన టిప్పు సుల్తాన్‌ హిందు, ముస్లిం ఐక్యత కోసం కృషి చేశారు. ఆయన హయాంలో అన్ని వర్గాల వారు సామరస్యంతో మెలిగారు. అటువంటి నాయకుని జయంతి ఉత్సవాల్ని కూడా ఇటీవల కాలంలో కొందరు రాజకీయ ప్రయోజనం కోసం వివాదాస్పదం చేస్తున్నా రు. కోర్టు విచారణలో ఉన్న హిజాబ్‌ వివాదంపై ఇరువర్గా లు సంయమనాన్ని పాటించి కర్నాటకు ఉన్న మంచి పేరు ను కాపాడుకోవడానికి ప్రతినబూనాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement