Thursday, May 2, 2024

నేటి సంపాదకీయం-తరుముకొస్తున్న ఒమిక్రాన్‌!

క‌రోనా సృష్టించిన భయాందోళనల నుంచి ప్రజలు ఇంకా బయటపడకముందే కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా అతివేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్‌ వల్ల భయం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా ఆ వైరస్‌ ప్రాణభయాన్ని సృష్టిస్తోంది. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌కు ఒక వ్యక్తి బలి అయినట్టు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్వయంగా ప్రకటించారు. ఒమిక్రాన్‌ మన దేశంలో ఇప్పటివరకూ 11 రాష్ట్రాల్లో వ్యాపించి నట్టు101పైగా కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణ, మహారాష్ట్రలలో చెరి 8 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 32, ఢిల్లిdలో 22 , రాజ స్థాన్‌లో 17 కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్‌ వల్ల ప్రాణ భయం లేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ డైరక్టర్‌ మరోసారి ప్రకటించారు. ఈ కొత్తవైరస్‌ బారిన పడిన వారికి తక్షణం వైద్య సౌకర్యం అందించడానికి తెలుగురాష్ట్రాల్లో ఆరోగ్య అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో కాకుండా, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలకు లోటు లేకుండా చర్యలు తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రెండు కోవిడ్‌ టీకాలను తీసుకున్న వారికి ఒమిక్రాన్‌ వల్ల ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ, ఈ టీకాల సామర్ధ్యాలను తగ్గించే శక్తి ఈ వైరస్‌కి ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా వచ్చే శారీరక రుగ్మతలు బయటపడగానే ఒమిక్రామ్ లక్షణాలేమోనని జనం భయపడుతున్నారు. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అలా వచ్చే వారి బలహీనతను ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలను కొత్తగా ఏర్పాటు చేసినట్టు ప్రచారమైతే జరుగుతోంది కానీ, సాధారణ రోగులు టెస్ట్‌లు చేయించుకోవడానికి అవి అందని పండులాగే ఉంటున్నాయి. ఒక వేళ టెస్ట్‌ చేసే పరికరాలు, యంత్రాలు ఉన్నా, వైద్యులు అందుబాటులో లేకపోవడమో,సిబ్బంది సమయానికి బయటికి వెళ్ళిపోవడమో వంటి ఉదంతాలు అందరికీ అనుభవమే. ఒమిక్రాన్‌ నియంత్రణ కోసం కంటైన్‌ మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టువార్తలు వచ్చాయి.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇది ఒమిక్రాన్‌ ప్రాంతం అని బ్యానర్లను వేలాడతీయడం జరిగింది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. అంటే మూతికి మాస్క్‌లు బిగించడం, సామాజిక దూరాన్ని పాటించడం కొనసాగించాలన్నది ఆ హెచ్చరికల సారాంశం. అయితే, మన సమాజంలో ఉన్న కలివిడితనం, పరస్పర అవసరాలు, బంధుమిత్రులతో మొహమాటాల కారణంగా సామాజిక దూరాన్ని పాటించడం సాధ్యంకావడం లేదేమోననిపిస్తుంది. బాగా కావల్సిన వారు, ఆప్తుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు, ఇతర కార్యక్రమాలకు వెళ్ళడం మళ్ళీ సాధారణమైంది. వీటిని నివారించలేం కానీ, కొత్త సినిమాలవిడుదల, రాజకీయ పార్టీల బహిరంగ సభలూ, ర్యాలీలను అదుపు చేసుకోవడం మన చేతుల్లోని పనే. కానీ, ఒకరు ప్రారంభిస్తే, తామేమి తక్కువని ఇతరులు తయారవుతున్నారు. మనది ప్రజాస్వామ్యం కనుక అందరికీ సమానావ కాశాలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఇచ్చేస్తుంటాయి. దాంతో జన సమూహాల కలయిక అనివార్యం అవుతోంది. కాగా, రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు ఇళ్ళ వద్దచేసుకోవడం తేలిక కావడంతో వైరస్‌ పరీ క్షలు కూడా ఇండ్ల వద్దే చేసుకోవడం కొందరు ప్రారంభించారు.

అయితే, అన్ని రకాల యాంటిజన్‌ పరీక్షలు ఒమిక్రాన్‌ విషయంలో ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వడజం లేదని అంటువ్యాధుల చికిత్సా నిపుణలు తెలియజేశారు. కరోనా టీకాలు ఇంకా తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇతర వేరియంట్ల కంటే 70 రెట్లు అధికమనీ, టీకాలు వేయించుకోవడంలో అశ్రద్ధ చేస్తే ఈ వైరస్‌ ఊపిరితిత్తుల్లో తన కణజా లంలో వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్‌కి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ గురించి చాలా చోట్ల ఇప్పటికీ అధిక సంఖ్యాకులకు తెలియదు.. కాగా, టీకాల విషయంలో అసమానతలు మనుషుల మధ్యనే కాకుండా దేశాల మధ్య కొనసాగుతున్నాయి. అధిక ఆదాయ దేశాల్లో 70 శాతం మంది టీకాలు వేసుకోగా, అల్పాదాయ వర్గాలు అధికంగా ఉన్న దేశాల్లో నాలుగు శాతం మంది మాత్రమే టీకాలు తీసుకున్నట్టు సమాచారం అందిందనీ, ఇది ప్రమాద కరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. మన దేశంలో రోజుకు పదివేల కోవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారి వల్ల కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement