Saturday, March 25, 2023

నేటి సంపాదకీయం-కొనుగోళ్ల గోసలు ఎన్నాళ్లు

వ్య‌వసాయం ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాభివృద్ధి కోసం సమష్టిగా చర్యలు తీసుకోవాలి. గతంలో అలాగే జరిగేది.ఇప్పుడు వ్యవసాయరంగానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు నలిగి పోతున్నారు. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల పరస్పర వాదులాట, తగువుల వల్ల రైతులకు న్యాయం జరగడం లేదు. ఏడాదికి మూడు పంటలు పండించేట్టు రైతులను ప్రోత్సహిస్తామని గొప్పలు చెప్పే నాయకులు రెండు పంటల ఉత్పత్తుల విక్రయానికి ఏమాత్రం తోడ్పడటం లేదు. ప్రభుత్వం వేయమన్న పంటలు వేసిన రైతులు, చేతికందిన తర్వాత ఆ పంట కొనేవారు లేక గగ్గోలు పెట్టే పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాతావరణాన్నీ, భూసారాన్ని బట్టి పంటలు వేయాలని వ్యవసాయశాస్త్రజ్ఞులు చెబుతున్నా, ఫలానా పంట వేయమని ఆదేశించిన ప్రభుత్వం తీరా పంట చేతికి అంది వచ్చిన తర్వాత దానిని కొనేందుకు చేతులెత్తేస్తోంది. పైగా వరి, గోధుమ పంటల విషయంలో చూపుతున్న తేడా గురించి ఎన్నో సార్లు వ్యవసాయ నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చినా ఫలితం ఉండటం లేదు.

ఉత్తరాదిన గోధుమకు ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా మద్దతుధర విషయంలో కానీ, ఎగుమతుల విషయంలో కానీ, ఆ పంటకే ప్రాధాన్యం లభిస్తోంది. వరి విషయంలో ప్రభుత్వాలు హామీ ఇవ్వలేకపోతున్నాయి. ఇందుకు కారణం ఏమిటో కేంద్ర ప్రభుత్వం నిర్ధారించాలి. మన దేశంలో పండే వరికి విదేశాల్లో గిరాకీ లేదనీ, నాణ్యత పేరు చెప్పి దిగుమతులు చేసుకోవడం లేదని అంటున్నారు. అలాంటప్పుడు వరిని ప్రభుత్వ పరంగా కాకుండా మిల్లర్లు బియ్యంగా మార్చి విదేశాలకు ఎలా ఎగుమతి చేయగలుగుతు న్నారు? కేంద్రం కనుసన్నల్లోనే ఇది జరుగుతోందని వ్యవసాయ రంగానికి చెందిన వారంటున్నారు. గతంలో ప్రతి సీజన్‌కూ ముందు వరి పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం సమావేశపర్చి ఎంత పంట పండించాలో లక్ష్యాలను నిర్ణయించేది. కానీ, ఇప్పుడు అలా జరగడం లేదు. నోటిమాటతో కేంద్ర నాయకులు చెబుతున్నారంటూ రాష్ట్రాలు అంటున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ధాన్యం కొనుగోలు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెనువివాదంగా మారింది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, విరుద్ధమైన ప్రకటనలు విన్నరైతులకు విశ్వాసం పోతోంది. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అసలు కొంటారో కొనరో తెలియక, తీవ్ర వ్యధకు గురవుతున్నారు.

- Advertisement -
   

పెట్టుబడిని రాబట్టుకోవడం కోసం ఇప్పటికే ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు తమ పాట్లను ప్రభుత్వాలు గుర్తించడం లేదని వాపోతున్నారు. అధికోత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడు అందుకు తగిన రీతిలో ఆహార ధాన్యాలను నిల్వచేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. గోదాముల సంఖ్యను పెంచాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భారత ఆహార సంస్థకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయించాలి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే లెవీ విషయమై వెలువడిన ప్రకటనలు ప్రభుత్వం ధాన్య సేకరణ బాధ్యతనుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు అనిపించాయి. లెవీ శాతాన్ని తగ్గించనున్నట్టు సంకేతాలి చ్చింది. ఆనాడే ఈ ఆలోచనలను వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు వ్యతిరేకించారు.

మన దేశంలో ఇప్పటికీ కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పుడు అందని పండుగానే తయారయ్యాయి. వ్యవసాయ రంగానికి గతంలో ప్రోత్సాహాకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామికంరగానికి ఇస్తోంది. ఉత్పత్తులు పెరిగితేనే దేశం అభివృద్ధి సాధించినట్టు. జాతీయ వస్తూత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు దేశంలో పెరిగిన ఉత్పత్తులను బట్టే పెరుగుతూ ఉంటుంది. పేదరికానికి అడ్డుకట్ట వేయడం కోసం యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సంవత్సరానికి వందరోజులు పని కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వల్ల వ్యవసాయ రంగం ఊపు అందుకుంది. కానీ, ప్రభుత్వాలు మారిన తర్వాత ఈపథకానికి ఆదరణ తగ్గడంతో వ్యవసాయ రంగం ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement