Monday, April 29, 2024

గాలిలో ప్రాణాలు, జార్ఖండ్‌లో కేబుల్‌ కార్స్‌ ప్రమాదం.. ముగ్గురు మృతి..

విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. జార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్‌ వే కేబుల్‌ కార్లు ప్రమాదానికి గురవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ ఘటనలో ముగ్గురు మరణించారు. ఆదివారం సాయంత్రం నుంచి దాదాపు 50 మంది రోప్‌వే క్యాబిన్లలో చిక్కుకుపోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, వైమానికదళం, ఐటీబీపీ దళాలు రంగంలోకిదిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా సోమవారం రాత్రికి 27 మందిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. మిగతావారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలే ప్రమాదానికి కారణమని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ రోప్‌వే ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఈ ఘటన జరిగిన వెంటనే రోప్‌వే మేనేజర్‌, ఇతర ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకడం వల్ల ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఒకరైన బెంగాల్‌వాసి హెలికాప్టర్‌లోకి ఎక్కేముందు ప్రమాదవశాత్తు జారిపడి మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో హృదయవిదారకంగా ఉంది.

బైద్యనాథ్‌ ఆలయ సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు.. 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతాల్లోని రోప్‌ వే వద్ద పర్యటిస్తుంటారు. అయితే రోప్‌ వే ద్వారా నడిచే కేబుల్‌ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. దాదాపు 50 మంది 24 గంటలకు పైగా రోప్‌ వే క్యాబిన్లలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ త్రికూట్‌ రోప్‌వే భారత్‌లో ఎత్తైన వర్టికల్‌ రోప్‌ వే. ఇది 766 మీటర్ల పొడువు ఉంటుంది. 25 క్యాబిన్లు ఉంటాయి. ప్రతి క్యాబిన్‌లో నలుగురు ప్రయాణించే వీలుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement