Tuesday, October 8, 2024

రైతులకు ఈ కేవైసీ కష్టాలు.. అవగాహన లేక ఇబ్బందులు..

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌/అందోల్‌ : పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథక్నాన్ని ప్రవేశపెట్టింది. ఏటా 3 విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేలసాయం అందిస్తోంది. ఇక నుంచి సాయం పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరని నిబంధన జారీ చేసింది. సాయం యథావిధిగా పొందాలంటే ఈ కేవైసీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ వరకే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధిక సంఖ్యలో రైతులు ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉంది. రైతులు నమోదు చేసుకో కుంటే కేంద్రం అందించే కిసాన్‌ సమ్మాన్‌ సహాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో రైతులకు ఈ కేవైసీ పోర్టల్‌లో ఆధార్‌తోపాటు ఇతర వివరాలు నమోదు చేసుకోవడంలో అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఈ కేవైసీ నామమాత్రంగా సాగుతోంది. రైతులకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. మే 1 నుంచి కేవైసీ అవకాశం ఇవ్వగా ఇప్పటి వరకు 70 శాతానికి పైగా పూర్తయ్యింది. మరో 20 రోజులు గడువు మాత్రమే మిగిలింది. కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో 60142 మంది రైతులు సహాయాన్ని పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 36,659 మంది ఈ కేవైసీలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 23,483 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది.

2,185 మంది అనర్హులుగా ఉన్నారు.

ఈ కేవైసీ చేసుకోవాలంటే రైతుల ఆధార్‌ కార్డుకు మోబైల్‌ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలి. కానీ చాలామంది రైతుల మొబైల్‌ నెంబర్లు అధార్‌ కార్డులకు లింక్‌ లేదు. ముందుగా మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు లింక్‌ చేసుకోని పోర్టర్‌లో నమోదు చేయాల్సి ఉంది. 2019 నుంచి కిసాన్‌ సమ్మాన్‌ పథకం దేశంలోని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతీ సంవత్సరం రూ.6 వేలను మూడు విడతలుగా పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులకు అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, అదాయ పన్ను చెల్లింపు దారులు, పెన్షనర్లు, ఒకే ఇంట్లో ఎక్కువ మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఇందులో వీరిని తొలగించడానికి ఈ కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ అనుసంధానం చేయడంతో ఉద్యోగులు, ఆదాయం పన్ను చెల్లించే వారిని తొలగిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు చాలామంది మంది అనర్హులను గుర్తించారు. కేవైసీ తరువాత ఎక్కువ సంఖ్యలో అనర్హులు బయటపడే అవకాశం కనిపిస్తోంది.

అనుసంధానం ఇలా..

రైతులు ముందుగా పీఎం కిసాన్‌ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఆధార్‌ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీ-పీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్‌ఫోన్‌లో పీఎం కిసాన్‌ యాప్‌ ద్వారా లేదా కంప్యూటర్‌లో పోర్టల్‌ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు.

- Advertisement -

అవగాహన కల్పించరూ..

ఆధార్‌ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయ్రిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement