Friday, May 3, 2024

Follow UP | బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిలు వీరే.. నాలుగు రాష్ట్రాలకు నియామ‌కం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల ఇంచార్జులను ప్రకటించింది. తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ‘ప్రదేశ్ చునావ్ ప్రభారీ’ (రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి)గా నియమించగా, ‘సహ్-చునావ్ ప్రభారీ’ (సహ ఇంచార్జి)గా సునీల్ బన్సల్‌ను నియమించింది. ఇప్పటికే బన్సల్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వంలో మార్పులు-చేర్పులు చేసిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఎన్నికల సహ ఇంచార్జిగానూ కీలక బాధ్యతలు అప్పగించింది.

తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా బీజేపీ ఎన్నికల ఇంచార్జులను ప్రకటించింది. వైశాల్యంలో పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్‌కు ఇద్దరు సహ ఇంచార్జులను ప్రకటించింది. ఇంచార్జిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి బాధ్యతలు అప్పగిస్తూ.. సహ ఇంచార్జులుగా నితిన్ పటేల్, కుల్‌దీప్ బిష్ణోయ్‌లను నియమించింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఓమ్ ప్రకాశ్ మాథుర్‌ను ఇంచార్జిగా, కేంద్ర మంత్రి డా. మన్సుఖ్ మాండవియాను సహ ఇంచార్జిగా బీజేపీ అధిష్టానం నియమించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఇంచార్జిగా, మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సహ ఇంచార్జిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.

- Advertisement -

బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులతో అధిష్టానం సమావేశం

శుక్రవారం ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో పాటు ఆయా రాష్ట్రాల ఇంచార్జులుగా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లో ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా కొత్తగా నిర్మించిన భవంతిలో ఈ సమావేశం జరిగింది. ఇక్కడికి సమావేశంలో పాల్గొనే నేతలు మినహా వారి వ్యక్తిగత సిబ్బందిని కూడా అనుమతించరు. తద్వారా భేటీలో చర్చించిన వ్యూహాలు బయటకు లీక్ అవకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది.

శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఈ సమావేశం నుంచి మినహాయింపునిచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు ఇతర రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు అధ్యక్షులుగా నియమితులైన పురందేశ్వరి, బాబూలాల్ మరాండి, సునీల్ జాఖడ్ కూడా హాజరైనట్టు తెలిసింది.

తొలుత అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైన ఫలితాల ఆధారంగా ఉన్న లోటుపాట్లు, వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లే ప్రణాళికలపై మేథోమధనం జరిగినట్టు తెలిసింది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కూడా రాష్ట్రాల నాయకత్వాన్ని సమాయత్తం చేసే కసరత్తులో భాగంగానే పార్టీ అగ్రనేతలు నడ్డా, బీఎల్ సంతోష్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement