Friday, April 26, 2024

జడ్జీల నియామకంలో జాప్యమెందుకు.. కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు

న్యాయమూర్తుల నియామక అంశంలో కొలీజియం నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీం కోర్టు నొక్కిచెప్పింది. జడ్జీల నియామకంలో జాప్యానికి నవంబర్‌ 29లోపు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర న్యాయశాఖకు నోటీసులు జారీచేసింది. బెంచ్‌ను సమర్థవంతమైన న్యాయవాదులు అలంకరిస్తే తప్ప, రూల్‌ ఆఫ్‌ లా అండ్‌ జస్టిస్‌ అనే భావన పరిరక్షించబడదు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైకోర్టు కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియం నుంచి ప్రభుత్వం సూచనల దాకా విస్తృతమైన ప్రక్రియలో పేర్లను పరిగణనలోకి తీసుకుంటే, తగినంత తనిఖీలు, సమతుల్యత ఉన్నాయని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

సీజేఐతోపాటు జస్టిస్‌ కౌల్‌ కూడా కొలీజియంలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 10 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీం తెలిపింది. సాధారణంగా కొలీజియంకు నేతృత్వం వహిస్తున్న సీజేఐ న్యాయమూర్తుల నియామకంపై పరిపాలన పరంగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు. 2016లో అప్పటి సీజేఐ టీఎస్‌ ఠాకూర్‌ ద్వారా న్యాయశాఖ నియామకాల్లో జాప్యాన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జాప్యంతోపాటు బాంబే హైకోర్టు న్యాయమూర్తి దీపాంకర్‌ దత్తాను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కొలిజీయం చేసిన సిఫార్సు కూడా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. జస్టిస్‌ దత్తా నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన సిఫార్సుపై కొలీజియం ఎలాంటి అభ్యంతరం లేవనెత్తలేదు. సెప్టెంబర్‌ 26న అప్పటి సీజేఐ యూయు లలిత్‌ నేతృత్వంలోని కొలీజియం దత్తా పేరును సిఫార్సు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement