Monday, April 29, 2024

సీజన్​ మారింది.. డెంగీ పొంచి ఉంది.. తస్మాత్​ జాగ్రత్త!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఓ పక్కన కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లోనే డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ కరోనా కేసులు ప్రతీ రోజూ 500దాకా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాకాలం ఆరంభమవడంతో దోమలు పంజా విసురుతున్నాయి. దీంతో రాష్ట్రంలో డెంగీతోపాటు విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దోమకాటుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రులన్నీ, ప్రయివేటు ఆసుపత్రులు కూడా జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచే రాష్ట్రంలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమల పునరుత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో డెంగీ, మలేరియా, ఇతర వైరల్‌ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో డెంగీ కేసులు ఈ ఏడాది ఇప్పటికే 200 దాకా నమోదయ్యాయి. ఏప్రిల్‌, మే నుంచే హైదరాబాద్‌లో డెంగీ కేసుల నమోదు పెరుగుతంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్‌ మినహా ఇప్పటి వరకు 120 డెంగీ కేసులు నమోదు కాగా … అందులో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 60 దాకా మిగతావి ప్రయివేటు ప్రయివేటు ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. ప్రతీ రోజూ కనీసం 5 మంది దాకా డెంగీతో చేరుతున్నారని హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఇవీ డెంగీ లక్షణాలు…
పగలు కుట్టే ఎడిస్‌ ఈజిప్ట్‌, టైగర్‌ దోమల కాటు ద్వారా శరీరంలోకి నాలుగు రకాల వైరస్‌లు చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. డెంగీ బారిన పడితే శరీరం ఎర్రగా కందిపోవడంతోపాటు కీళ్లు, కండరాలు, ఒళ్లు నొప్పులు వస్తాయని, కళ్లు కదిలించలేనంతా మూతలు పడతాయని , వాంతులు అవుతాయని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
డెంగీ, ఇతర దోమకాటు వ్యాధులు ప్రబలుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రతీ వారం మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దోమలు పెరగకుండ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ఆవరణలో శ్లాబుల పైనా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత వస్తువులు, కొబ్బరి బోండాలు, టైర్లు, కూలర్లలో నీరు ఏ మాత్రం నిల్వ ఉండకుండా చూడాలని సూచిస్తున్నారు.

ఎలిషా టెస్టులో నిర్దారణ అయితేనే డెంగీగా భావించాలి రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు
ప్రతి జ్వరాన్ని డెంగీగా భావించి ప్రయివేటు ఆసుపత్రులకు పరుగులు తీసి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు సూచించారు. ఎలీషా పరీక్షలో నిర్ధారణ అయితేనే డెంగీగా భావించాలంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతోపాటు డెంగీ నిర్ధారణ కోసం ఎలిషా టెస్టులను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అన్ని పీహెచ్‌సీల వైద్యులను అప్రమత్తం చేశామన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement