Thursday, May 2, 2024

Big Story | ఏటా మిగులుతున్న ఇంజనీరింగ్‌ సీట్లు.. ఈసారైనా భర్తీ అయ్యేనా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రతీ ఏటా సీట్లు పెద్ద సంఖ్యలోనే మిగిలిపోతున్నాయి. డిమాండ్‌ లేని సివిల్‌, మెకానికల్‌, తదితర కోర్సులకు సంబంధించిన సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కావడంలేదు. మూడు విడతల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు చేపడుతున్నా అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడంలేదు. గత ఏడాదిలో మొత్తం 177 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొత్తం 79,346 ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లు ఉంటే మొదటి, రెండు, తుది విడత కౌన్సెలింగ్‌లో 63,899 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే అధికారిక గణాంకాల ప్రకారం 80.53 శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఇంకా 15,447 ఇంజనీరింగ్‌ సీట్లు 2022లో నిండలేదు.

అభ్యర్థుల రిపోర్టింగ్‌ అనంతరం ఈ సంఖ్య ఇంకా కొంచెం పెరిగే అవకాశమే ఉంది. గతేడాది కేవలం తుది విడతలో 26,094 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా అందులో 6632 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 19,412 సీట్లు మిగిలాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలో మొత్తం 80,091 సీట్లు ఉన్నాయి. అయితే వీటిలో కన్వీనర్‌ కోటాలో 62,079 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 155 ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో, మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తారు. ఈసారి సీట్లు పూర్తి స్థాయిలో నిండుతాయా? లేదా? అనేది చూడాల్సి ఉంది. లేకుంటే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 15 నుంచి 20 శాతం సీట్లు మిగిలిపోయే ఛాన్స్‌ ఉంది. గతేడాది కన్వీనర్‌ కోటా సీట్లు 79,346 ఉండగా, ఈసారి ఆ సంఖ్య 62,079కి పడిపోయింది.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి కాలేజీల సంఖ్య కూడా తగ్గింది. ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 16,617 సీట్లు ఉన్నాయి. దీని తర్వాత ఆ స్థాయిలో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 10,394 సీట్లు ఉన్నాయి. సీఎస్‌ఈ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మిషన్‌ లెర్నింగ్‌)లో 8,154 సీట్లు ఉన్నాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 3,567 సీట్లు, సీఎస్‌ఈ డేటా సైన్స్‌లో 4,635 సీట్లు, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానికస్‌ ఇంజనీరింగ్‌ (ఈఈఈ)లో 4454 సీట్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 3,936 సీట్లు ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీల్లో సీట్లు నిండితున్నప్పటికినీ మిగతా కాలేజీల్లో సీట్లు భర్తీ కావడంలేదు.

- Advertisement -

పైగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చదవడానికే విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దాంతో ఈ సీట్ల సంఖ్య పెరుగుతూ ఇతర కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈనేపథ్యంలోనే కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లకు డిమాండ్‌ పెరగడంతో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌ల సీట్లకు డిమాండ్‌ ఉండకపోవడంతో అవి చివరి వరకూ మిగిలిపోతున్నాయి. దీంతో సివిల్‌, మెకానికల్‌ సీట్లను సీఎస్‌ సీట్లకు మార్చుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఆయా యూనివర్సిటీలకు ప్రతిపాదనలు పెట్టుకున్నాయి. ప్రతీ ఏటా సివిల్‌, మెకానికల్‌ తదితర సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఏడాది కొత్తగా సీఎస్‌ సీట్లు మరో 10 వేల నుంచి 15 వేల వరకు పెరగనున్నాయి. దీంతో పాటు ఫార్మసీ, ఫార్మ్‌-డి సీట్లు కూడా ప్రతీ ఏటా మిగులుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement