Thursday, May 16, 2024

ఢిల్లీలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రుల పర్యటన.. రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలో తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులకు ఆహ్వానాలు అందించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వరుసగా రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆహ్వానించారు. శనివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయ మంత్రి బీకే సింగ్‌ను కలిశారు. అనంతరం గనులు, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. సాయంత్రం కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను రాష్ట్ర మంత్రులిద్దరూ కలిశారు.

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ దేశాల రాయబారులను, పారిశ్రామికవేత్తలను కలిశారు. రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న 13 ప్రాధాన్య రంగాలను గుర్తించింది. ఆయా రంగాల శాఖలను నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులను, సంబంధిత పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

- Advertisement -

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వ సానుకూల విధానాలు, త్వరితగతిన అనుమతుల మంజూరు వంటి అంశాల గురించి ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వివరించనున్నారు. పొడవైన సముద్ర తీర ప్రాంతం కల్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో భారీగా పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించగల్గితే ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement