Friday, April 26, 2024

ఫుడ్‌ పాయిజన్‌ ఘటన బాధేసింది, మీకు నా సహకారం ఉంటుంది.. బాసర విద్యార్థులతో గవర్నర్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం, వసతి, మౌళిక సదుపాయాలు అందించాలని ఆమె తెలిపారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన తనకు బాధకల్గించిందన్నారు. ఒక డాక్టరుగా ఆ ఘటన నన్ను ఎంతగానో కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను మీకు ఎంత సపోర్ట్‌ చేయగలనో అంత చేస్తానని విద్యార్థులతో ఆమె చెప్పారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, బాసర ట్రిపుల్‌ ఐటీ వర్సిటీలతో పాటు ఇతర యూనివర్సిటీల విద్యార్థులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బుధవారం కలిశారు. ఈసందర్భంగా విద్యార్థులు వర్సిటీల్లోని సమస్యలను గవర్నర్‌కు వివరించారు. అధ్యాపకుల కొరత, నాణ్యమైన విద్య, నిధుల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను గవర్నర్‌ దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా ఆందోళనలను చేపడుతున్నా అధికారులు తమ గోడును పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్‌ విద్యార్థులకు ఈమేరకు హామీ ఇచ్చారు. వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నట్లు ఆమె వెల్లడించారు. వాటిని పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని ఆమె తెలిపారు. విద్యార్థులు జాబ్‌ సీకర్స్‌ మాత్రమే కాదని, జాబ్‌ క్రియేటర్స్‌ కూడా అని ఆమె చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగలో భాగంగా ఆన్‌లైన్‌ వ్యాసరచన పోటీలను వర్సిటీల్లో నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement