Monday, April 29, 2024

Delhi | ఈ సీజన్లో వాయువ్య భారతదేశంలో అత్యధిక వర్షపాతం.. అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈ ఏడాది రుతుపవనాలు భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం లోక్‌సభలో హైదరాబాద్ ఎంపీ (ఏఐఎంఐఎం) అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లిఖిత పూర్వక సమాధానమిస్తూ దేశంలో అధిక వర్షాలు, వాతావరణ మార్పులపై గణాంకాలతో సహా వివరించారు.

2020లో వాతావరణ మార్పులపై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం 1901-2018 మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల మేర పెరిగిందని వెల్లడించారు. రోజుకు 150 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం – వర్ష తీవ్రత నమోదయ్యే ఉదంతాలు 1950 – 2015 మధ్యకాలంలో 75% పెరిగాయని, అలాగే 1951-2015 మధ్య కాలంలో కరవు పరిస్థితులు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపారు. 1998-2018 మధ్యకాలంలో రుతుపవనాల అనంతరం అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుల సంఖ్య పెరిగిందని అన్నారు.

మరోవైపు విపత్తు నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర మంత్రి తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టం – 2005 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తుల విషయంలో చర్యలు చేపడతాయని అన్నారు. చట్ట ప్రకారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఏవైనా విపత్తులు జరిగినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహాయ చర్యలు చేపడతాయని తెలిపారు. ఈ ఏడాది సంభవించిన తుఫానులు, భారీ వర్షాల కారణంగా దేశంలోని అటవీ ప్రాంతానికి నష్టం జరిగినట్టు సమాచారం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement