Friday, December 6, 2024

గ్రూప్‌ – 1లో సర్కారు వారి పాటెంత.. అవకతవకలపై గవర్నర్‌ విచారణకు ఆదేశించాలి: లోకేష్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్‌ – 1 ఇంటర్యూల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వందలాది మంది ప్రతిభావంతులకు తీరని అన్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. గ్రూప్‌ – 1 ఉద్యోగాల్లో సర్కారు వారి పాటెంతని ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలను అడ్డుకుని సర్కారు వారి పాట ఆట కట్టిస్తామని అన్నారు. ఇంటర్యూల్లో భారీ అక్రమాలు చేసుకుంటున్న నేపథ్యంలో వీటిపై గవర్నర్‌ దృష్టి సారించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అత్యంత పారదర్శకంగా డిజిటల్‌ మూల్యాంకనం చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు నివేదించిందని డిజిటల్‌ విధానంలో ఎంపికైన 324 మందిలో కేవలం 124 మంది మాత్రమే మ్యాన్యువల్‌ వ్యాల్యూషన్‌లో ఎంపికయ్యారని దీని వెనుక ఉన్న మతలబు ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

డిజిటల్‌లో మాయాజాలం జరిగిందా? మ్యాన్యువల్‌లో అవకతవకలు చేశారా అన్న అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నారా లోకేష్‌ అన్నారు. గతంలో విడుదల చేసిన జాబితాలో 202 మంది పేర్లు గల్లంతయ్యాయని దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మ్యాన్యువల్‌లో 47 మంది మాత్రమే ఎంపికయ్యారని దీని వెనుక నాటకం ఏంటో తెలియని పరిస్థితి ఉందన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో ఇంటర్యూకు 75 మంది ఎంపికైతే వ్యాల్యూషన్‌ను మూడు నెలల నుంచి 8 నెలలకు సాగదీసి 48 మందికి కుదించారని ఆరోపించారు. ఇవన్నీ గమనించినట్లు అయితే గ్రూప్‌ – 1 ఎంపికలో పూర్తిగా అవకతవకలు ఉన్నట్లుగా స్పష్టమవుతుందని అన్నారు. ఈ అక్రమాలకు గవర్నర్‌ నిష్పాక్షిక విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా చూడాలని నారా లోకేష్‌ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement