Thursday, May 16, 2024

కేసీఆర్ ను కలిసేందుకు బైక్ యాత్ర – న్యాయం కావాలి

అతను ఓ మాజీ నక్సలైట్. ఆదివాసి బిడ్డడు. సుమారు 14 సంవత్సరాలు అజ్ఞాత దళ కమాండర్ న్యూ డెమోక్రసీ ఉద్యమానికి ఊపిరి పోశాడు. ఎంతోమంది ఆదివాసులకు అండగా నిలిచి పోడు భూములను పంచి పెట్టిన దళ నేత. అలాంటి విప్లవకారుడికి ఎన్నో ఏళ్ల క్రితం తన తండ్రి సాగు చేసుకుంటున్న పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటే భూమిని సాధించేందుకు తన ఇలవేల్పు అయిన సమ్మక్క దీక్ష పూనాడు. తన కుమారుని వెంటబెట్టుకుని బైక్ యాత్రగా ముఖ్యమంత్రి ని కలవడానికి బయలుదేరాడు.

వివరాల్లోకి వెళ్తే గుండాల మండలం లక్ష్మి దేవిపల్లి గ్రామానికి చెందిన, కోరం వెంకటేశ్వర్లు అలియాస్ గణేషన్న ఆదివాసీ . తన తల్లి తండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. ఇప్పుడు గణేష్ కు 40 ఏళ్ళు. సుమారు 18ఏండ్ల వయసులో విప్లవోద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి గుండాల మండల అజ్ఞాత దళ కమాండర్ గా పని చేసారు. అనేక ప్రజా సమస్యల కోసం రైతులను ప్రజలను చైతన్య పరిచాడు. గుండాల, ఆలపల్లి ఆదివాసీలకు అండగా నిలిచాడు. అనేకసార్లు పోలీసులు ఎదురు కాల్పులనుండి చాకచక్యంగాతప్పించుకున్నాడు. 2014లో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతి లో కలిశాడు.

ప్రభుత్వ పిలుపునందుకుని గణేష్ జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ అతని జీవనభృతికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వ జీవనభృతి ని కల్పిస్తామని చెప్పినప్పటికీ గణేష్ విషయంలో అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో తన తండ్రి సాగుచేసుకుంటున్న భూమిని తను చేసుకుంటూ జీవనం కొనసాగిద్దామని అనుకున్నాడు. కాగా తమకున్న 25 ఎకరాలలో 20 ఎకరాల పోడు భూమికి ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వారు. తనకు ఆధారం అనుకున్న భూమి ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది గణేష్ కు .

తన భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో తన భూమిని తనకు దక్కేలా చేయాలని సమ్మక్క సారక్క దేవతలను కొలుస్తున్నాడు. సమ్మక్క దీక్షను పూనుకున్నాడు. నాడు అజ్ఞాత దళ కమాండర్ గా గన్ను పట్టిన గణేష్ అన్న నేడు సమ్మక్క దీక్షబూని కొరడాను చేపట్టాడు. తన కుమారుని వెంటబెట్టుకుని బైక్ యాత్ర గా అన్ని గ్రామాలలో, పోడు సమస్యను ప్రచారం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి పోడు సమస్యను విన్నవిచేందుకు గుండాల నుండి బయలు దేరాడు. మరి గణేష్ అనుకున్నది సాదిస్తాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement