Friday, May 10, 2024

Heavy Floods | యమునకు పోటెత్తిన వరద.. చరిత్రలోనే ఆల్​టైమ్​ రికార్డు​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యమునా నది మహోగ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో నదిలో వరద ఉధృతి చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. 1978 నాటి గరిష్ట వరద రికార్డును అధిగమించి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. ఎగువన ఉన్న హత్నీకుండ్ జలాశయం నుంచి నీటిని పెద్ద మొత్తంలో ఒకేసారి విడుదల చేయకుండా నియంత్రించాలని, తద్వారా వరద ప్రభావాన్ని తగ్గించాలని కేంద్ర జల సంఘాన్ని కోరారు.

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో అటు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన మంత్రులతో పాటు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా పర్యటించారు. ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేసి తీవ్ర అవస్థ పడుతున్న ప్రజలను పరామర్శించారు. అధికారుల సహాయచర్యలను పర్యవేక్షించారు. మరోవైపు ఎర్రకోటకు వెనుకవైపున ఉన్న లోహపు వంతెనపై రాకపోకలను ప్రభుత్వం ఇప్పటికే మూసేసింది. వరద ప్రవాహం వంతెన కింది భాగాన్ని తాకుతూ వెళ్తోంది. మరింత పెరిగితే వంతెనకు సైతం ముప్పు పొంచి ఉంది.

ఆల్ టైమ్ రికార్డ్ వరద
యమునా నదిలో వరద తీవ్రత 205.33 మీటర్లు దాటితే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. రెండ్రోజుల క్రితమే ఈ మార్కును దాటి ప్రవహిస్తున్న యమునా నది బుధవారం మధ్యాహ్నానికి చరిత్రలోనే ఎన్నడూ లేనంత గరిష్టస్థాయికి చేరింది. ఇప్పటి వరకు 1978లో నమోదైన గరిష్ట వరద నీటి మట్టం 207.49 మీటర్లు కాగా బుధవారం మధ్యాహ్నం 207.72 మీటర్ల గరిష్ట నీటిమట్టం నమోదైంది. 2013లో కేదార్‌నాథ్ జలప్రళయం సమయంలో వరద తీవ్రత 207 మీటర్లు దాటినప్పటికీ, గరిష్ట రికార్డును అధిగమించలేదు. కానీ ఈసారి గత రెండ్రోజులుగా ఢిల్లీలో వర్షాలు లేనప్పటికీ ఎగువన కురిసిన వర్షాలకు తోడు హత్నీకుండ్ జలాశయం నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడం కారణంగా ఈ పరిస్థితి సంభవించింది. యమునా నదిలో నీటి మట్టాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement