Friday, May 3, 2024

అభ్యంతరాల పరిశీలన తర్వాతే తుది జాబితా.. కేజీబీవీ టీచర్ల పిటిషన్‌పై హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న బోధనా సిబ్బంది బదిలీల సందర్భంగా వారు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిశీలించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మినిమమ్‌ టైం స్కేల్‌ అర్హత ఉన్నప్పటికీ, తమకు అమలు చేయడం లేదని, అభ్యంతరాలను పరిగణించకుండా బదిలీల షెడ్యూల్‌ విడుదల చేశారని పేర్కొంటూ కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి విచారణ జరిపారు. ఈ సందర్భంగా కేజీబీవీ కాంట్రాక్ట్‌ టీచర్ల బదిలీల సమయంలో వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిశీలించాలని, ఆ తర్వాతే తుది జాబితా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ టీచర్ల తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, అయితే ఆ మేరకు ఎంటీఎస్‌ వర్తింపజేయలేదని, ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేస్తున్నా తగిన వేతనాలు అందడం లేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరఫున న్యాయవాది కేవీ రఘువీర్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు- చేసిన కమిటీ- అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటు-ందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.

కేజీబీవీ టీచర్ల బదిలీలకు తాజా షెడ్యూల్‌ విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీలలో పని చేస్తున్న టీచర్ల బదిలీలలో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్‌(ఇన్‌చార్జ్‌) ఎస్‌. సురేష్‌ కుమార్‌ కొత్త షెడ్యూల్‌ విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 5 వరకు అప్పీల్స్‌, విన్నపాలు స్వీకరించనున్నారు. 6న తుది సీనియారిటీ జాబితా ప్రకటన, 7 నుంచి 9వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను ఇవ్వాలి. 11, 12 తేదీల్లో జాయినింగ్‌ ఆర్డర్స్‌ విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement