Thursday, May 9, 2024

Delhi | ఇంకా కొలిక్కిరాని కాంగ్రెస్ టికెట్ల కసరత్తు.. మరోసారి భేటీకానున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన రెండు కీలక సమావేశాల్లో 70 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. శుక్రవారం ఉదయం గురుద్వారా రకాబ్‌గంజ్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో స్క్రీనింగ్ కమిటీ చివరి సమావేశం జరిగింది. సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది.

సోమ, మంగళవారాల్లో ఏదో ఒకరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై మిగతా 49 స్థానాల కసరత్తు పూర్తి చేస్తుందని పార్టీ నేతలు వెల్లడించారు. మొత్తం కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒకేసారి 119 స్థానాలకు జాబితాను విడుదల చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం గం. 11.00 సమయంలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కే. మురళీధరన్ అధ్యక్షతన సమావేశమైంది.

కమిటీలో సభ్యులుగా ఉన్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కితో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు అభ్యర్థుల వడపోత కసరత్తును పూర్తి చేశారు. 80-90 స్థానాల వరకు ఒకే అభ్యర్థిని ఖరారు చేయగా, మిగతా స్థానాల అభ్యర్థుల విషయంలో కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది.

- Advertisement -

ఆయా స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురి పేర్లతో జాబితాను అధిష్టానానికి అందజేసినట్టు తెలిసింది. దానిపై సాయంత్రం గం. 5.00 సమయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కే. మురళీధరన్ వంటి కమిటీ సభ్యులతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు.

రెండు గంటల పాటు కసరత్తు జరిగింది. ఒక్కో నియోజకవర్గంపై లోతుగా, సమగ్రంగా చర్చించినట్టు నేతలు వెల్లడించారు. ఈ భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కే. మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాటి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయిందని చెప్పారు.

సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై మిగతా స్థానాలకు కసరత్తు పూర్తి చేస్తుందన్నారు. విపక్ష కూటమిలోని మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తయిన తర్వాత జాబితాను ఒకేసారి ప్రకటిస్తామని అన్నారు. ఇప్పటికైతే 70 సీట్లతో జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని, మైనారిటీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఏయేవర్గాలకు ఎన్ని సీట్లు ఇచ్చామన్నది జాబితా ప్రకటించిన తర్వాత అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించక ముందే ఓకే కుటుంబంలో ఒకరికి మించి సీట్లు ఇస్తున్నట్టుగా ప్రచారం చేయడం తగదని ఆయనన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement