Monday, April 29, 2024

అడవుల పునరుద్ధరణ చర్యలు భేష్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవుల పునరుద్ధరణ చర్యలు భేష్‌ అంటూ జాతీయ భద్రతా కళాశాల (నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ) ఢిల్లి బృందం అభినందించింది. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 15 మంది సభ్యుల ఢిల్లి బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ బృందం అధ్యయనం చేస్తోంది. ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ తేజా బీర్‌ సింగ్‌ నేతృత్వంలోని ఈ బృందంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన అధికారులు ఉన్నారు. అలాగే ఇండోనేషియా, ఫిలిప్ఫైన్స్‌, బర్మాకు చెందిన సైనిక అధికారులు కూడా బృందంలో సభ్యులుగా ఉన్నారు. మంగళవారం ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తో భేటీ అయ్యి, ఆయన సూచన మేరకు తెలంగాణకు హరితహారం, అర్బన్‌ ఫారెస్టు పార్కులపై అధ్యయనం చేశారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ అర్బన్‌ ఫారెస్టు పార్కును సందర్శించారు. పెరిగిన పట్టణ ప్రజల అవసరాలకు తగినట్లుగా పర్యవరణ హితంగా తీర్చిదిద్దిన ఆక్సీజన్‌ పార్కును తిలకించిన ఢిల్లి బృందం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

పార్కులోని వాకింగ్‌ ట్రాక్‌, యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ (మియావాకి విధానం), బట్టర్‌ ఫ్లై పార్కు, ఔషద మొక్కల గార్డెన్‌, వాకింగ్‌ ఎవియరీ, ఓపెన్‌ క్లాస్‌ రూమ్‌, పిల్లల ఆటస్థలం సహా ఇతర సౌకర్యాలను సభ్యులు ఆసక్తిగా గమనించారు. తెలంగాణకు హరితహారం ద్వారా అమలుచేస్తున్న జంగల్‌ బచావో జంగల్‌ బడావో కార్యక్రమాలను ఢిల్లి బృందానికి పీసీసీఎఫ్‌ ఆర్‌. ఎమ్‌. డోబ్రియల్‌ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం ద్వారా చేపట్టిన పనులు, పురోగతిపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అటవీ పునరుద్ధరణ ద్వారా సాధించిన ఫలితాలను వీడియా దృశ్యాల ద్వారా ప్రదర్శించారు. ఇదిలావుండగా, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, కొత్త ఆయకట్ల స్థిరీకరణ, రాష్ట్ర స్థూల ఆర్ధిక వృద్ధిలో వ్యవసాయ రంగం వాట వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి అభినందనీయమని ఢిల్లిd బృందం పేర్కొంది. భూగర్భజలాల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ వంటి పథకాల అమలులో దేశానికే తెలంగాణ మార్గదర్శకమని తెలిపింది.

హరితహారం మంచి కార్యక్రమం తేజ్‌ బీర్‌ సింగ్‌..

పర్యావరణ రక్షణకు దోహదపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం మంచి కార్యక్రమం అని ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ తేజ్‌ బీర్‌ సింగ్‌ అన్నారు. అర్బన్‌ పార్కుల అభివృద్ధి చాలా బావుందని ప్రశంసించారు. గ్లోబల్‌ సిటీగా ఎదుగుతోన్న హైదరాబాద్‌కు పర్యావరణ అవసరాలను తీర్చే విధంగా అటవీ శాఖ కృషి చేయడం అభినందనీయమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement