Friday, May 17, 2024

Delhi | పొత్తుపై కాంగ్రెస్ పార్టీయే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి : సీపీఐ నేత నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులపై కాంగ్రెస్ పార్టీయే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. పొత్తులపై స్పందిస్తూ.. జాతీయస్థాయిలో విపక్ష ‘ఇండి’ కూటమిలో సీపీఐ ఉందని గుర్తుచేశారు.

ఈ కూటమి ధర్మాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని మేం కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నాయని, ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ చర్ఛలు ఇంకా కొలిక్కి రాలేదని అన్నారు. కాంగ్రెస్‌కు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి, తమకు కావాల్సింది సీట్లే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీయే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఊరించి, ఉసూరుమనిపించారు

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంశంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఊరించి, ఉసూరుమనిపించిందని నారాయణ ఆరోపించారు. పురుషాధిక్య సమాజం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి అంత త్వరగా ఒప్పుకోదని, అందుకే ‘చందమామ రావే, జాబిల్లి రావే’ అంటూ చిన్నారికి అన్నం తినిపించినట్టు మహిళా బిల్లు పెట్టారని సూత్రీకరించారు.

మహిళా బిల్లుకు సీపీఐ పూర్తి మద్దతునిస్తోందని, అయితే ఈ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టినందున ఇప్పట్లో అమలుకావని అన్నారు. తక్షణమే ఈ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి  మహిళల ఓట్ల కోసం ఈ బిల్లు తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. విపక్షాలు ‘ఇండియా’ పేరుతో జట్టుకట్టినప్పటి నుంచి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ చేస్తే ఉత్తర, దక్షిణ దేశాల మధ్య గొడవలు పెరుగుతాయని, దేశం రెండుగా విడిపోవడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

అదానీ కోసమే మణిపూర్ హింస

మణిపూర్‌లో రెండు వర్గాలను బీజేపీయే రెచ్చగొడుతోందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఓవైపు మయన్మార్ నుంచి కుకీల వలసలను ఆపకుండా, మరోవైపు మైతీలకు ఆయుధాలు అందేలా చూస్తూ మణిపూర్‌ను మంటల్లో పడేసిందని దుయ్యబట్టారు. సందట్లో సడేమియా అంటూ ఆ రాష్ట్రంలోని సహజ వనరులను అదానీకి దోచిపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి పంటను బీజేపీ నేతలు.. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే అమ్ముకుంటున్నారని, ఆయనే నెంబర్ 1 స్మగ్లర్ అని ఆరోపించారు.

మరోవైపు సనాతన ధర్మాన్ని బీజేపీ ప్రోత్సహిస్తూ సమాజంలో గొడవలు పెడుతోందని ఆరోపించారు. ఆ ధర్మం ప్రకారం భర్త చనిపోతే భార్యను ఆ చితి మంటలపై తగులబెట్టాలని, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఎవరైనా చనిపోతే వారి భార్యలను చితి మంటలపై వేస్తారా అని ప్రశ్నించారు. అధికారం కోసం దేశం ఏమైపోయినా ఫరవాలేదు అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని నారాయణ మండిపడ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement