Thursday, May 2, 2024

బీజేపీవి అన్నీ అబద్ధాలే.. ఏ ఒక్క హామీ నెరవేరలేదు, అధికారంలోకొస్తే సమాజ్‌వాదీ థాలీ

ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, హామీలన్నీ అబద్ధాలే అంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. ఘాజియాబాద్‌లో శనివారం ఆర్‌ఎల్‌డీ జాతీయ అధ్యక్షుడు జయంత్‌ చౌదరీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో సమాజ్‌వాదీ క్యాంటీన్లు, సమాజ్‌వాదీ కిరాణా దుకాణాలు ప్రారంభిస్తామని అఖిలేష్‌ ప్రకటించారు.

పేద ప్రజలకు తక్కువ ధరకే మంచి భోజనంతో పాటు వస్తువులు, సరుకులను అందజేస్తామన్నారు. సమాజ్‌వాదీ క్యాంటీన్స్‌లో రూ.10కే కడుపు నిండా భోజనం పెడ్తామని తెలిపారు. దీన్ని సమాజ్‌వాదీ థాలీగా పిలుస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఆకలితో కడుపు మాడ్చుకునే పరిస్థితి ఉండదని, గతంలోనే వీటిని కొన్ని చోట్ల ప్రారంభించామని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుతం అధికారంలోకి వచ్చాక వాటిని మూసివేయించిందని అన్నారు. పని ఎంతో మంది పొట్ట చేతపట్టుకుని నగరాలకు వస్తారని, అలాంటి వారి కోసం ఉపాధిని కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 11లక్షల ప్రభుత ఉద్యోగాలను కూడా ప్రాధాన్యత ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, వ్యవసాయం కోసం ఫ్రీ కరెంట్‌ అందజేస్తామన్నారు.

రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. ఒపినియన్‌ పోల్స్‌ కూడా వారికి అనుకూలంగానే ఉంటాయని విమర్శించారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే.. సెంట్రల్‌ ఎజెన్సీలు రంగంలోకి వస్తాయని.. బెదిరింపులకు పాల్పడుతాయని, వాటిని తాము లెక్క చేయబోమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది సమాజ్‌వాదీ పార్టీ కూటమియే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయం కారణంగానే.. బీజేపీ కుట్ర పూరితమైన రాజకీయాలకు తెరలేపిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement