Friday, May 3, 2024

తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదు.. నదీ జలాల వివాదంపై ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిపై వున్న నీటి పారుదల, పవర్ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాల్సి ఉన్నా ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలూ ఆ పని చేయలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నీటి విడుదలపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల గురించి టీడీపీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా బదులిచ్చారు. కృష్ణా నది నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణా రాష్ట్రం నీటిని వాడుకుందని ఆయన చెప్పారు. నీటి విడుదలపై తమ ఆదేశాలు పాటించాలని కృష్ణ నది నిర్వహణ యాజమాన్య బోర్డు తెలంగాణాను మూడు సార్లు కోరిందని తెలిపారు. కృష్ణా నదిపై వున్న అన్ని నీటి పారుదల, పవర్ ప్రాజెక్టులను కృష్ణా నది నిర్వహణ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

విశాఖలో కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం
కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కి మార్చాలని 2020 అక్టోబర్‌ 6న జరిగిన 2వ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. విశాఖపట్నంలో కేఆర్‌ఎంబీకి అవసరమైన మేరకు ఉచిత వసతిని అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి నిర్ధారించారా అని కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయంగా విశాఖపట్నంను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిందని చెప్పారు. 2022 మే 6న జరిగిన కేఆర్‌ఎంబీ 16వ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చ జరిగిందని వెల్లడించారురు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement