Sunday, May 5, 2024

ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభ ఎన్నికైన సభ్యులు శుక్రవారం రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసినవారిలో తెలంగాణ నుంచి దీవకొండ దామోదర్ రావు (టీఆర్ఎస్), బండి పార్థసారథి రెడ్డి (టీఆర్ఎస్), ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్. నిరంజన్ రెడ్డి (వైఎస్సార్సీపీ), ఆర్. కృష్ణయ్య (వైఎస్సార్సీపీ) ఉన్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తమ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు నేతలకు టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణస్వీకార సమయంలో నామాతో పాటు పార్టీ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), కేఆర్ సురేశ్ రెడ్డి, వెంకటేశ్ నేత హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంటర్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత కాసేపు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణస్వీకారం చేసిన బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య, ఆ తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ సంఘాల ధర్నాకు హాజరయ్యారు. ఓబీసీలకు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో పాటు బీసీల సమస్యలపై జరుగుతున్న ధర్నాకు తన మద్ధతు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement