Saturday, April 27, 2024

తెలంగాణ పథకాలను దేశమంతా అమలు చేయాలి.. జాతీయ స్థాయి రైతు సంఘాల తీర్మానం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకురావాలని జాతీయ స్థాయి రైతు సంఘాల సమావేశం తీర్మానించింది. మంగళవారం ఢిల్లీలో రాకాబ్ గంజ్ గురుద్వార్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ కిసాన్ మహా సంఘం జాతీయ స్థాయి రైతు సంఘాల సమావేశం నిర్వహించింది. దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను ఉపసంహరణ చేసే క్రమంలో ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ప్రత్యేక ఉద్యమ కార్యచరణ రూపొందించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల రైతు సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు.

రైతు ఉద్యమ కార్యాచరణకు కోటపాటి నరసింహం నాయుడు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య తరఫున తమ వంతు సహకారాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న రైతుబందు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మొత్తం ధాన్యం సేకరణ అంశాలను ఆయన సమావేశంలో వివరించారు. ఇతర రాష్ట్రాలలో కూడా తెలంగాణ మాడల్ రైతు పథకాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకురావాలని తీర్మానం చేశారు. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అంటూ కొనియాడిన రైతు సంఘాల నేతలు తీర్మానాన్ని ఆమోదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement