Sunday, May 19, 2024

Delhi | గెలుపు గుర్రాలకే అవకాశం.. ఢిల్లీలో బీజేపీ పెద్దల కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కసరత్తు చేపట్టింది. ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈమేరకు శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ నాయకత్వంతో జరిగిన తెలంగాణ కోర్ గ్రూప్ సమావేశంలో తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇంఛార్జిలు తరుణ్ చుగ్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాశ్ తదితరులు పాల్గొనగా.. తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో మెజారీటీ సీట్లను కైవసం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. 17 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులుండగా.. మిగతా 13 స్థానాల్లో ఆశావహులు, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాల గురించి చర్చ జరిగింది. సిట్టింగ్ స్థానాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి సోయం బాపూరావుతో పాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలించినట్టు తెలిసింది.

మిగతా 13 స్థానాల్లో ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆశావహులున్నారు. మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజిగిరి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీపడుతున్నట్టు తెలిసింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా.. జాతీయ నేతల్లో మురళీధర్ రావు కూడా ఈ నియోజకవర్గంపై కన్నేసినట్టు తెలిసింది.

అయితే అక్కడ సంఘ్ నేపథ్యం కల్గిన విద్యాసంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి, సురేశ్ రెడ్డితోపాటు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబం గురించి చర్చించినట్టు తెలిసింది. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 2 పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు చర్చ జరిగింది.

- Advertisement -

బీబీ పాటిల్ తరహాలోనే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో మరికొందరు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు, మంతనాలు సాగిస్తున్నారు. వారి పేర్లను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన జాబితాను కిషన్ రెడ్డి నడ్డాకు అందజేశారు. ఫిబ్రవరి 29న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మెజారిటీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డా.లక్ష్మణ్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణాలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్‌పై కూడా చర్చించామని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతోనూ బీజేపీ జాతీయ నాయకత్వం ఎన్నికల వ్యూహాలపై వరుస సమావేశాలు నిర్వహించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement