Tuesday, May 7, 2024

‘ఆపరేషన్ గంగ’లో తెలంగాణ భవన్… స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది తెలంగాణ విద్యార్థులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యుద్ధభూమి ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే ‘ఆపరేషన్ గంగ’ వేగంగా సాగుతోంది. రొమేనియా, హంగేరి దేశాల మీదుగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని భారత విద్యార్థులను ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో భారత ప్రభుత్వం తరలిస్తుండగా, వచ్చినవారిలో తెలుగువారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించే పనిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్లు చురుగ్గా పనిచేస్తున్నాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి మొత్తం 3 విమానాలు భారత్ చేరుకోగా, అందులో రెండు ఢిల్లీకి, ఒకటి ముంబైకి చేరుకుంది. అలాగే హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీ చేరుకుంది. శనివారం రాత్రి ముంబై చేరుకున్న విమానంలో 14 మంది, ఆదివారం ఢిల్లీ చేరుకున్న 3 విమానాల్లో కలిపి మొత్తం 25 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులను అధికారులు గుర్తించారు. వారందరినీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు తరలించి వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణ భవన్ అధికారులు, అనంతరం వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌కు టికెట్లు బుక్ చేసి పంపిస్తున్నారు. అక్కణ్ణుంచి విద్యార్థులను వారి ఇళ్ల వరకు చేర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలుగు విద్యార్థులను గుర్తించే క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నారు.

విదేశాంగ శాఖ కంట్రోల్‌ రూమ్‌తో కలసి పనిచేస్తున్నాం..

‘ఆపరేషన్ గంగ’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతీయుల తరలింపు కార్యక్రమంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం తో అనునిత్యం సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ చేరుకునే విమానాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులను గుర్తించి, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇందులో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కూడా 24 గంటలూ పనిచేస్తోందని వెల్లడించారు.

ఉక్రెయిన్ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది: విద్యార్థులు..

ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తున్న విద్యార్థులు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగొచ్చినవారిలో 6వ సంవత్సరం విద్యను పూర్తిచేసుకున్నవారి నుంచి తొలి ఏడాది వైద్య విద్య అభ్యసిస్తున్నవారి వరకు ఉన్నారు. ఉక్రెయిన్ ప్రజలు భారతీయుల పట్ల మర్యాదగా, ఆప్యాయంగా ఉంటారని, అలాంటి ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశం విదేశాంగ వైఖరిలో భాగంగా రష్యాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ ప్రజలు మాత్రం భారతీయుల పట్ల ఎలాంటి కోపం, ద్వేషం ప్రదర్శించరని చెబుతున్నారు. శని, ఆదివారాల్లో భారత్ చేరుకున్నవారిలో చాలా వరకు యుద్ధ ప్రభావం అంతగా లేని పశ్చిమ ప్రాంతాల నుంచే తిరిగొచ్చినట్టు చెప్పారు. యుద్ధ ప్రభావం లేకపోయినా, యుద్ధం కారణంగా ఏటీఎంలు ఖాళీ అయిపోవడం వల్ల కొంత ఇబ్బందిపడ్డామని, అయితే ఇండియన్ ఎంబసీ తమను రొమేనియా, హంగేరి సరిహద్దులకు బస్సుల్లో తరలించిందని, అక్కణ్ణుంచి ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సిబ్బంది తమను బుకారెస్ట్, బుడాపెస్ట్ నగరాలకు తరలించి ప్రత్యేక విమానాల్లో భారత్ పంపించారని చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కోసం చాలా ఏర్పాట్లు చేశాయని హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం జరుగుతుందని అసలు ఊహించలేదని, తమ యూనివర్సిటీ యాజమాన్యాలు సైతం పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదని విద్యార్థులు చెప్పారు. నిజానికి చాలా మంది భారత్ తిరుగుప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్నామని, ఒక్కసారిగా యుద్ధం మొదలై గగనతలం మూసేయడంతో తమ ప్రయాణాలన్నీ రద్దయ్యాయని వివరించారు. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో సొంతూరికి చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement