Friday, April 26, 2024

గడ్డం గీసుకోవాలని ప్రధానికి రూ.100 పంపిన టీ స్టాల్ వ్యక్తి

గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోదీకి మహారాష్ట్రలోని బారామతికి చెందిన టీ అమ్ముకునే వ్యక్తి రూ.100 పంపాడు. దాంతో పాటు ఓ లేఖను కూడా జత చేశాడు. కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలలుగా దేశంలోని అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బారామతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే ప్రధానికి తన అసంతృప్తి గళాన్ని ఈ విధంగా వినిపించాడు.

`పీఎం నరేంద్రమోదీ గడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి. చివరి రెండు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాని దృష్టి సారించాలి’ అంటూ ఆ లేఖలో మోరే పేర్కొన్నాడు.

`నాకు మన దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం. నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు రూ.100 పంపుతున్నాను. దానితో ఆయన గెడ్డం గీయించుకోవాలి. ఆయన ఈ దేశ అత్యున్నత నాయకుడు. ఆయణ్ని అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మహమ్మారి కారణంగా రోజు రోజుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఈ మార్గం ఎంచుకున్నాను’ అంటూ మోరే తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement