Sunday, April 28, 2024

సీఎం జగన్ మొద్దు నిద్ర పోతున్నాడు: చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు ప్రచార పర్వం ముగిసింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో తాను విస్తృతంగా తిరిగానని, ఎక్కడ చూసినా ప్రజల్లో ఆవేదన నెలకొందన్నారు. తాము ఇప్పటివరకు అధికార పక్ష దోపిడీ గురించి ఏం చెప్పామో, ప్రజల్లో కూడా అవే అభిప్రాయాలు నెలకొన్నాయన్నారు. ధరల పెరుగుదల, ప్రజలపై దాడులు, ఎక్కడ చూసినా సహజ వనరుల దోపిడీ, అవినీతి తదితర అంశాల్లో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతోందన్నారు. అభివృద్ధి జరగకపోగా, రాష్ట్రం అప్పుల్లో నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘన అడుగడుగునా జరుగుతోందని ఆరోపించారు.

ఏపీలో 164 ఆలయాలపై దాడులు జరిగాయని భారత దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఇన్ని దేవాలయాలపై దాడులు జరగలేదని వివరించారు. తిరుమల పవిత్రత దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టడం, అమాయకులను హత్య చేయడం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. మద్యం, ఇసుక దోపిడీ ఎక్కువైందని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, పేద పిల్లల చదువుకు సీఎం అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, వచ్చే నెల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే ఈ సీఎం మొద్దనిద్ర పోతున్నాడని, డీఎన్‌డీ బోర్డు పెట్టుకున్నాడని (డోంట్ డిస్ట్రబ్) విమర్శించారు. సంవత్సరంలో 365 రోజులు సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేసే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement