Wednesday, May 1, 2024

గుట్కా డెన్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి.. పొగాకు ఉత్పత్తులు స్వాధీనం, ఆటో సీజ్‌

వరంగల్‌ , ప్రభన్యూస్‌: ప్రభుత్వ నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల దందాపై పోలీసులు ఫోకస్‌ పెట్టినా పోలీసుల కళ్ళుగప్పి చేస్తున్న గుట్కా అక్రమ రవాణా, సరఫరాను అరికట్టలేకపోతున్నారు. గతంలో కొందరు వ్యాపారులు మాత్రమే గుట్కా, పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకొని, ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు కూడా దాటించి జోరుగా దందా నిర్వహించేవారు. ఓరుగల్లు పోలీసుల డేగ కన్నేయడం, మెరుపు దాడులు నిర్వహించడం, పాన్‌ షాప్స్‌, కిరాణం కొట్టులపై పోలీసులు దాడి చేసి, తనిఖీలు చేస్తూ, కేసులు నమోదు చేస్తుండటంతో బడా వ్యాపారులు కొంత వెనుకడుగు వేశారు. దీనితో మండలాల వారీగా ఎవరుపడితే వారు బీదర్‌కు వెళ్లి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను తీసుకొస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ధర్మసాగర్‌ మండలం మొత్తం గుట్కా, పొగాకు ఉత్పత్తుల సరఫరా చేస్తున్నట్టు- వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ సి హెచ్‌ శ్రీనివాస్‌ జీ విశ్వసనీయ సమాచారం అందుకొన్నారు. ధర్మసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముప్పారం గ్రామానికి చెందిన కందిమల్ల వేణుగోపాల్‌(42) ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన్నట్టుగా అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ టీం దాడి చేశారు.

ఈ దాడిలో 2 లక్షల 2 వేల 250 రూపాయల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కందిమల్ల వేణుగోపాల్‌కు మడికొండ ప్రాంతానికి చెందిన రవికంటి శేఖర్‌ నిషేధిత పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో తేలింది. కందిమల్ల వేణుగోపాల్‌ ఇంటి నుండి పొగాకు నిల్వలను ఆటోలో తీసుకెళ్లి మండలం మొత్తం నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్లప చేస్తున్న కసాగని యకయ్య, ఇంజల దేవేందర్‌ల విషయాన్ని పోలీసులు గుర్తించారు. 209 ప్యాకెట్ల అంబర్‌, 91 ప్యాకెట్ల ఆర్‌ఆర్‌, 190 ప్యాకెట్ల జేకే, 31 ప్యాకెట్ల స్వాగత్‌, 85 ప్యాకెట్ల బ్లాక్‌ బాబా నిల్వలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కందిమల్ల వేణుగోపాల్‌, ఇంజల దేవేందర్లను అరెస్ట్‌ చేశారు. రవికంటి చంద్రశేఖర్‌, కసాగని యకయ్యలు పరారీలో ఉన్నారు. తదుపరి చర్యల కోసమై నిందితులను ధర్మసాగర్‌ పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement