Friday, May 3, 2024

గుజరాత్‌లో భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌.. 350 కోట్ల విలువ‌ ఉంటుందని అంచనా

గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో గల ముంద్ర పోర్టు సమీపంలో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఏటీఎస్‌) జరిపిన సోదాల్లో ఒక కంటైనర్‌లో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. పట్టుబడ్డ హెరాయిన్‌ దాదాపు 70 కిలోలు ఉంటుందని, దీని విలువ సుమారుగా రూ. 350 కోట్లు ఉంటుందని ఓ అధికారి మంగళవారం తెలిపారు. అదేవిధంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని, పట్టుబడ్డ హెరాయిన్‌ పరిమాణం, విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. గత కొన్ని రోజులుగా గుజరాత్‌లోని పలు పోర్టుల్లో నిషిద్ధ మత్తు పదార్ధాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. ఏటీఎస్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా కంటైనర్‌లో సోదాలు జరపడంతో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. కొంత కాలం క్రితం వేరే దేశం నుండి వచ్చిన ఈ కంటైనర్‌ను పోర్టు బయట కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌లో అధికారులు గుర్తించారు. గత కొంత కాలంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర సంస్థలు, ఏటీఎస్‌ మరియు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) కోట్లాది రూపాయలు విలువ చేసే అక్రమ, కంటైనర్‌లను గుజరాత్‌ పోర్టుల్లో స్వాధీనం చేసుకున్నాయి.

గత సెప్టెంబర్‌లో ఇదే ముంద్ర పోర్టులోని రెండు కంటైనర్‌లలో అఫ్ఘనిస్తాన్‌లో తయారుచేయబడ్డ హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దీని పరిమాణం 3,000 కిలోలుండగా బహిరంగ మార్కెట్‌లో పట్టుబడ్డ ఈ హెరాయిన్‌ విలువ సుమారుగా 21,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అదే విధంగా గత మేలో కూడా ముంద్ర పోర్టు సమీపంలో డీఆర్‌ఐ అధికారులు రూ. 500 కోట్లు విలువ చేసే 56 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత ఏప్రిల్‌లో కూడా కచ్‌ జిల్లాలోని కండ్ల పోర్టు సమీపంలోని ఒక కంటైనర్‌లో 205.6 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 1,439 కోట్లు ఉంటుంది. అదే సమయంలో గుజరాత్‌ ఏటీఎస్‌, డీఆర్‌ఐ అధికారులు కలిసి సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఆర్మేలీ జిల్లాలోగల పిపావావ్‌ నగరం నుండి వచ్చిన కంటైనర్‌లో 450 కోట్ల రూపాయలు విలువ చేసే 90 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement