Saturday, April 20, 2024

సింహగిరి భక్తజన సంద్రం.. గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

విశాఖపట్నం , ప్రభన్యూస్‌ బ్యూరో: సింహం ఆకారంలో ఉన్న సింహగిరిచుట్టూ భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న కోర్కెలు నెరవేరడంతో పాటు సర్వపాపాలు హరించుకుపోతాయన్నది అప్పన్న భక్తకోటి ప్రగాడ విశ్వాసం. సింహగిరి ప్రదక్షిణ భూఫల ప్రదక్షిణతో సమానమని పురాన ఇతిహాస కథనం. ఈ నేపధ్యంలోనే సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం మంగళవారం మధ్యాహ్నం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. తొలుత కొండ దిగువున ఆలయ తొలిపావంచ వద్ద ఈవో ఎం.వి.సూర్యకళ పుష్పరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి రథాన్ని ధర్మకర్తల మండలి సభ్యులుతో కలిసి ఈవో జెండా ఊపి అప్పన్న పుష్పరధాన్ని ప్రారంభించారు. అయితే అప్పటికే లక్షలాది మంది భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడకన గిరిప్రదక్షిణలు ప్రారంభించారు. సుమారు 32 కి.మీల పొడవున భక్తులు కాలినడకన గిరిప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి ఆలయ తొలిపావంచ వద్దకు చేరుకున్నారు. అనంతరం మెట్ల మార్గం, ఇతర ప్రజారవాణా ద్వారా సింహగిరికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు.

5 లక్షల మందికి పైగా భక్తులు హాజరు..

ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సింహగిరి ప్రదక్షిణకు ఈ ఏడాది భక్తులు పొటెత్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లు గిరిప్రదక్షిణను ఆలయ వర్గాలు నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండ దిగువున పాత గోశాల జంక్షన్‌ నుంచి వాహనాలను నిలిపివేశారు. అంతకు ముందు గోపాలపట్నం పెట్రోల్‌ బంకు నుంచి పెందుర్తి వైపు వాహనాలు మళ్లించారు. మరో వైపు పాత అడవివరం వద్ద వాహనాలు నిలుపుదల చేసి భక్తులకు ప్రజారవాణా కల్పించారు. గిరిప్రదక్షిణ నేపధ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ ఏ.మల్లికార్జున నిరంతరం గిరిప్రదక్షిణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మరో వైపు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో సుమారు 2016 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరంతా నిరంతరం సేవలందించారు. అంతేకాకుండా ఆలయ అధికారులు, ఇతర సిబ్బంది , స్వచ్చంద సంస్థలు పూర్తిస్థాయిలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేశారు. గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరు కావడంతో ఎటు చూసిన భక్తజన కోలాహలంగా కనిపించింది. విశాఖలో గిరిప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా మొత్తం అధికార యంత్రాంగం ఉత్సవం విజయవంతంపైనే దృష్టిసారించింది. ఈ ఉత్సవంలో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దొడ్డి రమణ, దినేష్‌రాజు, రాజేశ్వరి, శ్రీదేవి వర్మ, పి.పద్మ, రామలక్ష్మి, చందుయాదవ్‌, శేషారత్నం తదితరులంతా పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement