Sunday, May 19, 2024

Delhi | టార్గెట్ 2024.. విస్తృత కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయడం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సైన్యాన్ని సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇంచార్జులతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నేతృత్వంలో రోజంతా జరిగిన ఈ సమావేశంలో గత కొన్నాళ్లుగా నిర్వహించిన ‘మహా జన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం గురించి సమీక్ష జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి, అంతర్జాతీయంగా పెరిగిన దేశ ఖ్యాతి, ఇచ్చిన హామీల అమలు తదితర అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం గురించి సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.

- Advertisement -

ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న వ్యవహారం గురించి కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ఉదాహరణకు కోవిడ్-19 మహమ్మారి దేశంపై విరుచుకుపడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. కానీ చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం కేంద్ర ప్రభుత్వ లోగో కూడా ముద్రించడం లేదని, ప్రధాన మంత్రి ఫొటో కూడా పెట్టడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఒక సందర్భంలో తెలంగాణలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అదే తరహాలో కేంద్రం అనేక రాష్ట్రాల్లో పేద ప్రజల కోసం గృహాలను మంజూరు చేసింది.

అయితే వాటిని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండడంతో ఇళ్లకు ఆయా రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న పార్టీల రంగులు వేసి, వాటిని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవడం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ తరహాలో అనేక పథకాలు, ప్రాజెక్టుల గురించి ప్రజలందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, బీజేపీ కార్యకర్తలు ఏడాదికాలంలో ప్రతి ఇంటికీ చేరి వివరించేలా కార్యక్రమాలు రూపొందించాలని చర్చించినట్టు తెలిసింది. బీజేపీ బలంగా లేని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం ఎలా అన్న అంశంపై చర్చించినట్టు తెలిసింది. అలాగే బలంగా ఉన్న చోట మరింత బలోపేతం చేయడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అధినేతలు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

తొలుత బీజేపీ ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, కిసాన్ మోర్చా వంటి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సాయంత్రం వరకు సమావేశం జరిగింది. సాయంత్రం గం. 5.00 సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శులతో మొదలైన సమావేశం అర్థరాత్రి వరకు కొనసాగింది. మోర్చాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమాల రూపకల్పన గురించి చర్చించారు. బీసీ గర్జన, బీసీ సమ్మేళనం వంటి కార్యక్రమాలు అందులో భాగంగానే ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. మొత్తంగా రోజంతా జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించే ప్రధానంగా చర్చించినప్పటికీ, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement