Thursday, April 25, 2024

ప్రతి కుటుంబానికి రూ.4వేలు సాయం ప్రకటించిన సీఎం స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులోని ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కరోనా రిలీఫ్ కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.4,000 ఇచ్చే దస్త్రంపై సంతకం చేశారు. మొదటి దశ కింద ఈ నెలలో రూ.2,000 ఇస్తామన్నారు. స్టాలిన్ నిర్ణయంతో రెండు కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే బాలికలు, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా పాల ధర లీట‌ర్‌కు రూ.3 తగ్గింపుపైనా సీఎం స్టాలిన్ సంతకం చేశారు. ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని సీఎం స్టాలిన్ తెలిపారు.

కాగా తమిళనాడు ఎన్నికల్లో మ్యానిఫెస్టోను ప్రకటించిన డీఎంకే ‘స్టాలిన్ 7 ఉరుదిమొళిగళ్’ అనే పేరుతో పథకాలను ప్రకటించారు. మొత్తం 505 హామీలను డీఎంకే ప్రకటించింది. అధికారంలోకి వస్తే హిందూ ఆలయాల పర్యటనకు లక్ష మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున సాయం, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే నీట్‌ రద్దుకు ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని పేర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 157 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement