Friday, May 3, 2024

Suspensions – పార్లమెంట్ లో ఆగ‌ని విప‌క్షాల ఆందోళ‌న – 92 మంది ఎంపీలు స‌స్పెండ్

న్యూఢిల్లీ – పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 78 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈరోజు లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన వారి సంఖ్య 92కి చేరింది..పార్లమెంట్‌ లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు, లోక్‌సభ లో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్‌ మరోసారి సస్పెన్షన్‌ వేటు వేశారు. కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

వారిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో ముగ్గురి సస్పెన్షన్‌ అంశం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఎంపీలు కె. జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీఖ్‌ స్పీకర్‌ పోడియంను ఎక్కి నినాదాలు చేశారు. వీరి సస్పెన్షన్‌కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

అలాగే రాజ్యసభలో భద్రతా వైఫల్యంఫై హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ఆందోళనకు దిగిన 45 మంది ఎంపీలను సస్సెండ్ చేశారు.. . చాలా మంది సభ్యులు బెంచ్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖఢ్ అన్నారు. అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని అన్నారు. దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే రెండు రోజుల క్రితం 14 మంది ఎంపీలు సస్సెండ్ కు గురికావడంతో మొత్తం ఉభయ సభలలో సస్పెండ్ అయిన వారి సంఖ్య 92 కి చేరింది.

మరోవైపు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ, ఆ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ, కకోలి ఘోష్‌, శతాబ్ది రాయ్‌ తదితరులు ఉన్నారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement