Friday, May 3, 2024

Suryapet – ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ – మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట – ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ సంబురాలను సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఘనంగా నిర్వహించారు.మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం అవరణలో జరిగిన వేడుకలలో ముందుగా హిందూ, ముస్లీం, మైనార్టీ పెద్దలు బీ ఆర్ఎస్ ప్రభుత్వ క్షేమాన్ని కోరుతూ సర్వమత ప్రార్దనలు నిర్వహించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నదని,సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

ఆలయాలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మసీదులు, చర్చిలకు ఆధునిక హంగులద్దేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఇల వైకుంఠంగా సర్వాంగ సుందరంగా మార్చారన్నారు. ధూప, దీప నైవేద్య పథకంతో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు అర్చకులు, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తున్నారన్నారు.. మౌలానాలు, పాస్టర్లకు అదే స్థాయిలో గౌరవ భృతి ఇస్తున్నారని తెలిపారు.. బ్రాహ్మణ పరిషత్‌ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విదేశీ విద్య అభ్యసించేలా పేద బ్రాహ్మణ పిల్లలకు
అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.


విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గాంధీ జీ కలలు కన్న గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.అభివృద్ధి జరిగిన చోట ఉత్సవాలు నిర్వహించడం తెలంగాణ లో మినహా దేశం లో మరి ఎక్కడ లేదన్నారు. గత పాలకుల హయాం లో పండుగొచ్చినా ఎవరూ సాయం చేయలేదు. ఆలయాలు, చర్చిలు, మసీదు పెద్దలను ఆదుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వాలన్నీ పండుగలన్నింటినీ చిన్నచూపు చూసినవే. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌.. ఆలయాలు, చర్చిలు, మసీదుల ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గుర్తించారు.మైనార్టీ వర్గాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, పవిత్రబోధకుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తామని, బోధకుల సంక్షేమానికి వేతనాలు అందజేస్తామని వారిని ఓటు బ్యాంకు గా చూశాయి తప్పా ఏనాడూ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే సహకరిస్తున్నారన్నారు. మైనార్టీలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో వసతులు, ఇతర సౌకర్యాల కల్పనకు పెద్ద సంఖ్యలోనే నిధులు మంజూరు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement