Monday, May 6, 2024

Big Story | విత్తన అమ్మకాలపై నిఘా.. బీజీ-3 విత్తనాల బ్యాన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజీ -3 (బోల్‌గార్డ్‌ -3 ) పత్తి విత్తనాలపై రాష్ట్ర్ర వ్యవసాయశాఖ కొరఢా ఝులిపిస్తోంది. బీజీ-3 విత్తనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించిన నేపథ్యంలో వ్యాపారులు బీజీ-3 అమ్మకాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది. విత్తన కంపెనీలు పెట్టే ప్రలోభాలకు లొంగి రైతులకు బీజీ-3 విత్తనాలు అంటగడిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. బీజీ-3 విత్తనం సాగు చేసిన చెట్టు ఏపుగానే పెరిగినా ఎక్కడా పూత, కాత రాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎకరాకు కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే చోట కనీసం క్వింటా పత్తి కూడా వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల క్రితం మెదక్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో రైతులు లక్షల ఎకరాల్లో బీజీ-3 సాగు చేశారు. బీజీ-3 విత్తనాలపై నిషేధం కొనసాగుతున్నా కొన్ని బహుళజాతి సంస్థల తమ రహస్య ఏజెంట్ల ద్వారా రైతులను ఏ మార్చి ఏటా విత్తనాలను అమ్ముతూనే ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రతి ఏటా రాష్ట్రంలో వానాకాలంలో రైతులు పెద్ద విస్తీర్ణంలో పత్తి సాగుచేస్తుంటారు. ఈసారి కూడా దాదాపు 50లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండడంతో బహుళజాతి కంపెనీలు కొన్ని విత్తన వ్యాపారులను మభ్యపెట్టి వారి ద్వారా బీజీ-3 పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్నాయి. సాధారణంగా ఒక్కో విత్తన ప్యాకెట్‌పై డీలరుకు రూ.25 నుంచి రూ.30 లాభం వస్తుంది. కాని బీజీ-3 ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500దాకా లాభాన్ని ఆశచూపుతున్నారు.


బీజీ-3 విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు స్వయంగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ ఏడీఏ సుధారాణి నేతృత్వంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేశారు. పలు చోట్ల ఫర్టిలై జర్‌ షాపులను తనిఖీ చేసి విత్తనాల శాంపిళ్లను సేకరిస్తున్నారు. శాంపిళ్ల లో బీజీ 3 విత్తనాలు ఉన్నట్లు తేలితే ఆ విత్తన లాట్‌ను పూర్తి సెీజ్‌ చేయడంతోపాటు ఆ షాపును మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement